కొడిమ్యాల, వెలుగు: బ్యాంకు ఖాతా నంబర్‌ను అధికారులు తప్పుగా నమోదు చేయడంతో ఓ మహిళ ఐదేళ్లుగా ఆసరా పింఛన్ కోల్పోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన మల్యాల లక్ష్మికి 2017 జూన్‌లో రూ.వెయ్యి ఆసరా పింఛన్ మంజూరైంది. అప్పటి ఎంపీడీవో ప్రొసీడింగ్స్ ఇచ్చినా, ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. 2019లో ప్రభుత్వం పింఛన్ ను రూ.2016కు పెంచినప్పుడు కూడా లక్ష్మికి అధికారులు మరోసారి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయినా డబ్బులు జమ కాకపోవడంతో ఆమె అధికారులను ప్రశ్నించగా మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించారు.
పలుమార్లు దరఖాస్తు చేసినా పింఛన్ రాలేదు. ఇటీవల గ్రామపంచాయతీ ఆఫీసుకు వెళ్లింది. అధికారులు పింఛన్ ఐడీతో వివరాలు పరిశీలించగా, ఆమె బ్యాంకు ఖాతా నంబర్ తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో గత ఐదేళ్లుగా పింఛన్ డబ్బులు జమ అవుతున్నట్లు వెల్లడైంది. దీంతో ఆగ్రహించిన లక్ష్మి, తనకు రావాల్సిన పింఛన్ మొత్తాన్ని చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీలతను కోరింది. ఖాతా తప్పిదం కారణంగా ఐదేళ్లలో రూ.1,83,000 పింఛన్ నష్టపోయానని వాపోయింది. పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని కార్యదర్శి శ్రీలత తెలిపారు.

