ఫ్యూచర్ సిటీ నగరం కాదు.. భవిష్యత్ : మంత్రి శ్రీధర్ బాబు

ఫ్యూచర్ సిటీ నగరం కాదు.. భవిష్యత్ : మంత్రి శ్రీధర్ బాబు
  • ఇన్వెస్ట్​ చేయాలని ఇఫ్కీ ప్రతినిధులను కోరిన మంత్రి శ్రీధర్ బాబు
  • పర్మిషన్లు ఇంకా ఈజీ చేసేందుకు ఏఐతో టీజీ ఐపాస్ లింక్
  • పలు సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇండో–ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం సెక్రటేరియెట్​లో ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. 

ఇది ఒక నగరం కాదని, భవిష్యత్తు అని పేర్కొన్నారు. “అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం. ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టబడులొచ్చాయి. గతేడాది హైదరాబాద్ లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాయి. ప్రతిభ గల మానవ వనరులకు ఇక్కడ కొరత లేదు. మరింత వేగంగా.. సరళంగా.. పారదర్శకంగా అనుమతులిచ్చేందుకు టీజీ–ఐపాస్ ను ఏఐతో లింక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం” అని చెప్పారు.

మంచి అవకాశాలున్నయ్​

సనోఫి, మోనిన్, సఫ్రాన్, క్యాప్ జెమినీ, డసో, టెలీ పర్ ఫార్మెన్స్, ఓపెల్లా హెల్త్ కేర్ లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. “ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్, ఆగ్రో ఇన్నోవేషన్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ మ్యానుఫాక్చరింగ్ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. 

దీన్ని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపండి” అని ఇఫ్కీ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో ఇఫ్కీ నుంచి యోహాన్ సామ్యూల్, ప్రియాంక్ ప్రకాష్, నకుల్ దల్వాలా, మోనిన్, ఓపెల్లా హెల్త్ కేర్, సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా, సనోఫీ ఇండియా, టెలిపర్ ఫార్మెన్స్, వార్ ఎలక్ట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, జీగ్లర్ ఏరోస్పేస్ తదితర పలు ఫ్రెంచ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాఫెల్ ఇంజన్ల విడిభాగాలు ఇక్కడే తయారీ 

ఫ్రెంచ్ విమాన ఇంజన్ల తయారీ సంస్థ సఫ్రాన్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న సఫ్రాన్ హైదరాబాద్ లో ఇప్పటికే రెండు ప్రపంచస్థాయి ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా శ్రీధర్ బాబు సమక్షంలో సఫ్రాన్ జనరల్ మేనేజర్ పియరీ ఫెర్నాండెజ్ కొత్త పెట్టుబడులను ప్రతిపాదించారు. నూతనంగా సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ అనే కొత్త కంపెనీని నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. రఫేల్, ఎం 88 ఫైటర్ జెట్ ఇంజన్ల నిర్వహణ, ఓవర్ హాలింగ్ పనులను సఫ్రాన్ చేపడుతుంది. 

దీనివల్ల వచ్చే ఏడాది చివరి నాటికి 150 కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత దశల్లో మరో 750 ఉద్యోగాలు వస్తాయి. రఫేల్ యుద్ధ విమానాల ఇంజన్లకు కీలక విడిభాగాలను సఫ్రాన్ తయారు చేస్తుంది. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది. హైదరాబాద్ అతిపెద్ద ఏరో స్పేస్ హబ్ గా రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి పియరీ ఫెర్నాండెజ్ మంత్రికి థ్యాంక్స్ చెప్పారు.