- రూ.2 వేల ఫైన్‌తో ఈనెల20 వరకు దరఖాస్తుకు చాన్స్
- మే 4 నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్ దరఖాస్తులు 3 లక్షల మార్కును దాటాయి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 3,00,462 మంది అప్లై చేసుకున్నట్లు ఎప్ సెట్ కన్వీనర్ కె.విజయకుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలోనే అత్యధికంగా 2,09,868 మంది అప్లై చేసుకోగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో 90,279 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
రూ.500 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తోనే ముగిసిందని పేర్కొన్నారు. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు రూ.2 వేల ఫైన్ తో ఈనెల20 వరకు, రూ.5 వేల ఫైన్ తో ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల భారీ జరిమానాతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉందని వివరించారు. మే 4వ తేదీ నుంచి ఎప్ సెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం www.eapcet.tgche.ac.in వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచించారు.

