టీజీ ఐసెట్లో 90 శాతం క్వాలిఫై

టీజీ ఐసెట్లో 90 శాతం క్వాలిఫై
  • ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దీంట్లో 90.83% మంది క్వాలిఫై అయ్యారు. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఎంజీయూ వీసీ ఆల్తాఫ్ హుస్సేన్ ఐసెట్ రిజల్ట్ ను విడుదల చేశారు. గత నెల 8,9 తేదీల్లో ఐసెట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షకు 71,746 మంది రిజిస్టర్ చేసుకోగా.. 64,938 మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. వీరిలో 58,985 మంది క్వాలిఫై అయ్యారు. 

అబ్బాయిలు 30,868 మంది పరీక్ష రాస్తే.. 27,998 మంది, అమ్మాయిలు 34,069 మందికి గాను 30,986 మంది అర్హత సాధించారు. ఫలితాలను https://icet.tgche.ac.in​లో పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఐసెట్ టాపర్​గా ఏపీకి చెందిన ఏ.క్రాంతికుమార్ నిలవగా, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వి.సాయికృష్ణ రెండోస్థానంలో నిలిచారు. ఏటా అక్టోబర్​లో అడ్మిషన్లు నిర్వహించే వారని, కానీ ఈ ఏడాది ఆగస్టులోనే ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు చేపడతామని టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్​కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఐసెట్ కన్వీనర్ రవి పాల్గొన్నారు.