- సర్కారు కాలేజీలు రీసెర్చ్ పై ఫోకస్ పెట్టాలి
- టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: సర్కారు డిగ్రీ కాలేజీలకు ర్యాంకులు, అక్రెడిటేషన్లు ఎంతో కీలకమని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో కాలేజీలకు నిధులు రావాలన్నా, జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కాలన్నా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్సే ప్రామాణికమని గుర్తుచేశారు.
అందుకే కాలేజీలు ఇకపై పాత పద్ధతుల్లో కాకుండా.. రీసెర్చ్, ఇన్నోవేషన్, పేటెంట్లపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని సూచించారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంకులో సర్కారు డిగ్రీ కాలేజీల కోసం టీజీసీహెచ్ఈ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. సర్కారు కాలేజీలకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేందుకు, మెంటరింగ్ చేసేందుకు కౌన్సిల్ సిద్ధంగా ఉందన్నారు.
నాణ్యమైన డేటా మేనేజ్‌మెంట్, రీసెర్చ్ అవుట్‌పుట్ పెంచుకోవడం ద్వారానే జాతీయ స్థాయి విద్యా సంస్థలతో పోటీ పడగలమని చెప్పారు. కాగా, ఎన్‌ఐఆర్‌ఎఫ్ మెథడాలజీ, స్కోర్ వెయిటేజీ ఎలా ఉంటుందో ఎస్‌కేఎల్‌టీఎస్‌యూ కన్సల్టెంట్ అడ్వైజర్ కె.వీరాంజనేయులు వివరించారు. అలాగే టీఎల్‌ఆర్, రీసెర్చ్ స్కోర్‌ను పెంచుకునేందుకు అనుసరించాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్‌పై ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జె.ఉపేందర్ అవగాహన కల్పించారు.
డేటాను వెబ్‌సైట్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి.. తప్పులు లేకుండా ఎలా చూసుకోవాలి? అనే అంశాలపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అకడమిక్ ఎక్సలెన్స్ డైరెక్టర్ శ్రీ కె.వెంకటేష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, కళాశాల విద్యాశాఖ జేడీ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్, సర్కారు డిగ్రీ కాలేజీల ఐక్యూఏసీ కోఆర్డినేటర్లు, నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
