లక్ష్మణ్​ ఆధ్వర్యంలో గవర్నర్​కు ఏపీ బీజేపీ నేతల విజ్ఞప్తి

లక్ష్మణ్​ ఆధ్వర్యంలో గవర్నర్​కు ఏపీ బీజేపీ నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26 బీసీ కులాలను  తిరిగి అదే జాబితాలో చేర్చేలా చూడాలని కోరుతూ ఏపీ బీజేపీ నేతలు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  ఆధ్వర్యంలో గవర్నర్ తమిళి సైకి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ ను వారు కలిసి, ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని బీసీల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఇతర వెనుకబడిన ఏపీ జిల్లాల నుంచి పలువురు హైదరాబాద్ కు వచ్చి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారు ఏపీలో బీసీలుగా ఉండగా, తెలంగాణలో మాత్రం ఆ జాబితాలో లేకపోవడంతో వారి పిల్లలు విద్య, ఇతర విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారని లక్ష్మణ్ గవర్నర్ కు వివరించారు.

బీఎల్ సంతోష్  జీవితం తెరచిన పుస్తకం: లక్ష్మణ్​

దేశం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి బీఎల్ సంతోష్ అని, ఆయన జీవితం తెరిచిన పుస్తకం అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్  అన్నారు. గురువారం హైదరాబాద్ లో  మీడియాతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు కక్షసాధింపు చర్యలో భాగంగానే సంతోష్ పై అక్రమ కేసు నమోదు చేసిందని మండిపడ్డారు. ఆయన కేసును కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. అవినీతి చేయకుంటే.. టీఆర్ఎస్ నేతలకు ఐటీ, ఈడీ, సీబీఐ అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. తమకున్న పరిధి, అధికారం మేరకు దర్యాప్తు సంస్థలు పనిచేసుకుపోతున్నాయని చెప్పారు. ఈ సంస్థలు రాష్ట్రంలో తనిఖీలు చేయడం కొత్త కాదన్నారు.