మేఘా అదే ధోకా: తెలంగాణ, ఏపీ మధ్య డబుల్ గేమ్

మేఘా అదే ధోకా: తెలంగాణ, ఏపీ మధ్య డబుల్ గేమ్
  • సంగమేశ్వరానికి మన మట్టి మన కంకర
  • పాలమూరు ప్రాజెక్టు నుంచి తవ్వి భారీ జెట్టీల్లో తరలింపు
  • పది రోజులుగా రాత్రిపూట గుట్టుగా రాకపోకలు
  • కాపలా కాస్తున్నయూపీ, బీహార్ కూలీలు
  • తవ్వినందుకు ఇక్కడ, తీసుకెళ్లినందుకు
  • అక్కడ కోట్లు దండుకుంటున్న కంపెనీ
  • మాటల్లోనే సర్కారు వ్యతిరేకత.. 
  • తెరవెనుక మేఘాకు సపోర్ట్
  • జెట్టీల వ్యవహారాన్ని జులై 17నే బయటపెట్టిన ‘వెలుగు’

తెలంగాణ, ఏపీ మధ్య మేఘా కంపెనీ ఆడుతున్న డబుల్ గేమ్ అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. మన నీళ్లను దోచుకెళ్లేందుకు కడుతున్న రాయల సీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మన మట్టి, మన రాళ్లనే తరలిస్తోంది. రెండు నెలల కిందట మేఘా ధోకాను ‘వెలుగు’లోకి తెచ్చిన తర్వాత కొన్నాళ్లు ఆపేసిన సదరు కంపెనీ.. ఇప్పుడు మళ్లీ దోపిడీ షురూ చేసింది. 

నాగర్​కర్నూల్, వెలుగు: కృష్ణా నదిపై ఏపీ సర్కారు కడుతున్న రాయలసీమ (సంగమేశ్వరం) లిఫ్ట్ ఇరిగేషన్​ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉంటలేదు. ఒకవైపు రాయలసీమ స్కీమ్ అక్రమమని, దాని వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని చెబుతూనే.. మరోవైపు అదే ప్రాజెక్టుకు పాలమూరు నుంచి మట్టి, ఇసుక, కంకర, రాళ్లు తరలించేందుకు మేఘా కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. ఎల్లూరు పంప్​హౌస్ దగ్గర్లో ‘మేఘా ఇంజనీరింగ్ కంపెనీ’ ఒకేసారి ఆరు టిప్పర్లతో మెటీరియల్ తరలించేందుకు వీలుగా భారీ జెట్టీ తయారు చేస్తున్న విషయాన్ని జులై​17న ‘వెలుగు’ బయటపెట్టింది. ‘మేఘా చీటింగ్’ పేరిట కథనం ప్రచురించింది. దీంతో అక్కడి నుంచి జెట్టీని ఏపీ వైపు తరలించిన మేఘా కంపెనీ తాజాగా మళ్లీ జెట్టీలను కృష్ణా నదిలో తిప్పుతోంది. పది రోజులుగా రెండు జెట్టీలతో పాలమూరు నుంచి మట్టి, రాళ్లు, ఇసుక, కంకరను తరలిస్తోంది. పగలు తెలంగాణ వైపు జెట్టీలను తెచ్చి.. రాత్రి పది తర్వాత మెటీరియల్ తరలిస్తున్న విషయం తాజాగా ‘వెలుగు’ పరిశీలనలో బయటపడింది.
అక్కడా, ఇక్కడా ప్రాజెక్టులు కడుతూ..
తెలంగాణలోని పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు, ఏపీలో రాయలసీమ లిఫ్టు స్కీం పనులను మేఘా కంపెనీనే దక్కించుకుంది. నిజానికి పాలమూరు–రంగారెడ్డి ఫస్ట్ ప్యాకేజీ పనులను మొదట నవయుగ కంపెనీ చేసింది. సగం పనులు పూర్తయ్యాక రాష్ట్ర సర్కారు జోక్యంతో కిందటేడాది మే నెలలో నవయుగ స్థానంలో ‘మేఘా’ టేకోవర్ చేసింది.


రూ.4,100 కోట్లతో పాలమూరు పంప్​హౌస్, అప్రోచ్ చానల్స్ పనులు చేస్తోంది. అదే సమయంలో ఏపీలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ కాంట్రాక్ట్​ను కూడా రూ.6,820 కోట్లకు దక్కించుకుంది. ఇలా కృష్ణా నదికి రెండు వైపులా భారీ ప్రాజెక్టులు కడుతున్న మేఘా.. ఇక్కడ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల్లో తవ్విన నల్లమట్టి, రాళ్లు, కంకర, రాక్​డస్ట్, ఇసుక తదితర మెటీరియల్​తో పాటు రెడీ మిక్సర్​ను కృష్ణా నది ద్వారా రాయలసీమ లిఫ్టు కోసం పంపుతోంది. పాలమూరు–రంగారెడ్డి పనులు జరుగుతున్న చోట భారీ క్రషర్​ను, రెడీ మిక్స్ ప్లాంట్​ను ఏర్పాటు చేసి రాళ్లను కంకరగా, రాక్​డస్ట్​గా, రెడీమిక్సర్​గా మారుస్తోంది. సీమ ప్రాజెక్టుకు కావాల్సిన సిమెంట్, ఐరన్, ఇతర మెటీరియల్​ను కూడా ఇక్కడి నుంచే తరలిస్తోంది.
అడ్డుకోని ఆఫీసర్లు.. నోరు విప్పని నేతలు
రాయలసీమ ప్రాజెక్టు కడుతున్న చోట మట్టి, ఇసుక, కంకర కొరత తీవ్రంగా ఉంది. దీంతో మేఘా కంపెనీ ప్రస్తుతం రెండు జెట్టీలను కృష్ణా నదిలో తిప్పుతూ ఇక్కడి మెటీరియల్​ను అక్కడికి తరలిస్తోంది. పాలమూరు--–రంగారెడ్డి అండర్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రదేశానికి దిగువన జెట్టీని నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. అటువైపు చెంచులు, జాలర్లు, మీడియా వాళ్లెవరూ రాకుండా యూపీ, బీహార్ కూలీలను పెట్టి కథ నడిపిస్తోంది. రెండు వైపులా తమకు అనువైన ప్రభుత్వాలు ఉండడంతో.. కెనాళ్లు, టన్నెళ్లు తవ్వినందుకు ఇక్కడ, అదే మట్టి, కంకర, రాళ్లను రాయలసీమకు వాడుతున్నందుకు అక్కడ వేల కోట్లు దండుకుంటోంది. రోడ్డు ద్వారా లారీల్లో తరలిస్తే కట్టాల్సిన టాక్సులను ఎగవేస్తోంది. 2011లో ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుకను కొల్లాపూర్ సమీపంలోని కృష్ణానది నుంచి ఇలాగే బోట్లు, జెట్టీల్లో అప్పటి ప్రభుత్వం సహకారంతో కాంట్రాక్ట్ సంస్థ తరలించింది. అప్పట్లో నాగర్​కర్నూల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో రాజకీయంగా దుమారం రేగింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. మన మెటీరియల్​ను సీమకు తరలిస్తున్న మేఘా జెట్టీలను ఇక్కడి ఆఫీసర్లెవరూ అడ్డుకోవడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులూ నోరు విప్పడం లేదు. దీంతో సర్కారుకు తెలిసే ఇదంతా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జెట్టీలకు పర్మిషన్ లేకున్నా..
కృష్ణా నదితోపాటు చుట్టూ ఉన్న నల్లమల అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ చిన్న పడవలు, తెప్పలకు తప్ప భారీ జెట్టీలకు పర్మిషన్ లేదు. కానీ మేఘా కంపెనీ మాత్రం రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా భారీ జెట్టీలను తిప్పుతోంది. దీనివల్ల స్థానికంగా నదిలో చేపలవేటను నమ్ముకుని బతుకుతున్న జాలర్లు, చెంచుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. రాత్రిపూట వలలు వేసి ఉదయం వాటిలో చిక్కిన చేపలను అమ్ముకోవడమే వీళ్ల జీవనోపాధి. కానీ జెట్టీల రాకపోకలకు వలలు అడ్డువస్తున్నాయని వాటిని కోసేస్తున్నారని జాలర్లు చెబుతున్నారు. ఒక్కో వల ధర దాదాపు రూ.5,500 వరకు ఉంటుందని, వాటిని కోసి తమకు బతుకుదెరువు దూరం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నిజానికి సోమశిల, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే టూరిజం బోట్లను కూడా సాయంత్రం తర్వాత అనుమతించరు. జాలర్లు వలలు తీసిన తర్వాత పగటి పూట నడిపిస్తారు. ప్రభుత్వ సంస్థలకు చెందిన బోట్ల రాకపోకలపై ఇలా కఠిన రూల్స్ అమలు చేసే ఫారెస్ట్ ఆఫీసర్లు.. మేఘా కంపెనీ బోట్లను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.