ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు బుద్ధి రాలేదు. ఇండియా మమ్మల్ని చూసి బయపడుతుందంటూ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి బలుపు కూతలు కూశాడు. పాకిస్తాన్‌లోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైఫుల్లా కసూరి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ అతడు ప్రసంగిస్తూ.. ఇండియా నన్ను చూసి భయపడుతుందని మీకు తెలుసా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
భారత్ ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని.. టెర్రర్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని ఇండియా తప్పు చేసిందని నీతులు వల్లించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి తనను సూత్రధారిగా నిందించడం ద్వారా ఇప్పుడు నా పేరు మొత్తం ప్రపంచంలోనే ఫేమస్ అయిందని ప్రగ్భలాలు పలికాడు.
కాశ్మీర్ మిషన్ నుంచి ఎల్ఈటీ ఎప్పటికీ వెనక్కి తగ్గదని అన్నాడు. సైన్యం నిర్వహించే కార్యక్రమాలు, సైనికుల అంత్యక్రియల ప్రార్థనలకు నాయకత్వం వహించడానికి పాక్ ఆర్మీ నుంచి తనకు ఇన్విటేషన్ వస్తుందని చెప్పాడు. సైఫుల్లా కసూరి అంగీకారంతో ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆర్మీ అండగా ఉంటుందని మరోసారి ప్రపంచం ముందు రుజువైంది.
