జోరు వానలు..భారీగా పెరిగిన కూరగాయల ధరలు

జోరు వానలు..భారీగా పెరిగిన కూరగాయల ధరలు

హైదరాబాద్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఏం కూరగాయలను ముట్టుకున్నా అగ్గిమండుతున్నాయి. రైతు బజారల్లో ఏ కూరగాయలైనా కిలో రూ. 40 పైనే పలుకుతున్నాయి.  బెండకాయ, గోరుచిక్కుడు  కిలో 40 రూపాయలు, చిక్కుడుకాయ, క్యాప్సికం కిలో 60 రూపాయలుగా ఉంది. ఇక క్యారెట్ కిలో 55 రుపాయలుగా పలుకుతోంది. టమోటా, బీరకాయ, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు కేజీ 40 రూపాయలుగా ఉన్నాయి. ఇక బండ్లు, కాలనీల్లోని షాపులు వద్ద వీటి డబుల్  రేట్లు ఉన్నాయి. 

వానల ఎఫెక్ట్..
సాధారణంగా వర్షాకాలంలో కూరగాయలు తక్కువగా ఉంటాయి. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో ధరలు పెరిగాయి. వర్షాలతో మార్కెట్ కు సరుకు ఎక్కువగా రావడం లేదని, అందుకే కూరగాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. వానలు ఇంకా పడితే ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. రేట్లు ఎక్కువగా ఉండడంతో కస్టమర్లు కొనడం లేదని, సరుకు అమ్ముడుపోక బయట పారబోస్తున్నామంటున్నారు.

వానల సాకుతో రేట్లు పెంచారు..
వానలను అడ్డం పెట్టుకొని వ్యాపారులు కూరగాయల ధరలు అమాంతంగా పెంచేశారని జనం అంటున్నారు. గతంలో 200 రూపాయలు కూరగాయల వారం మొత్తానికి సరిపోయేవని చెబుతున్నారు. ఇప్పుడు 500 నుంచి 600 రూపాయలు పెట్టినా వారం రోజులకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వర్షాల వల్లే..
వర్షాలతో స్టాక్ రావడం తగ్గినందుకే, కూరగాయలు ధరలు పెరిగాయని రైతు బజార్ అధికారులు చెబుతున్నారు. గత నెల కంటే ఈ నెలలో ధరలు పెరిగింది నిజమే అంటున్నారు.  వర్షాకాలం తర్వాత కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ప్రతి రైతు బజార్ లో ధరల పట్టిక ఉందంటున్నారు. దీని ప్రకారమే కూరగాయలు అమ్మాలని చెప్తున్నారు. బోర్డ్ మీద ఉన్న రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.