స్కూల్ ​స్టూడెంట్లతో టాయిలెట్ల క్లీనింగ్​ .. పేరెంట్స్​​ ఆగ్రహం

స్కూల్ ​స్టూడెంట్లతో టాయిలెట్ల క్లీనింగ్​ .. పేరెంట్స్​​ ఆగ్రహం
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
  • విద్యా శాఖ మంత్రి సొంత జిల్లా శివమొగ్గలో తాజా ఘటన

శివమొగ్గ: కర్నాటకలోని శివమొగ్గలో ప్రభుత్వ స్కూల్ టీచర్లు స్టూడెంట్లతో టాయిలెట్లను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలతో ఇలా టాయిలెట్లు కడిగిస్తున్న వరుస ఘటనలపై కర్నాటక వ్యాప్తంగా తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాష్ట్రం ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

 ఇటువంటి ఘటనలు మరోసారి జరగనివ్వం అని కర్నాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ప్రకటించిన తర్వాత రోజే ఆయన సొంత జిల్లా శివమొగ్గలో మళ్లీ బయటపడడం గమనార్హం. గతవారం బెంగళూరులోని ఆంధ్రాహళ్లి ఏరియాలోని ఓ ప్రభుత్వ బడిలో పిల్లలతో టాయిలెట్లు కడిగించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రలు ఆ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. స్పందించిన ప్రభుత్వం ఆ స్కూల్ హెడ్​మాస్టర్ ను సస్పెండ్ చేసింది.

 బెంగళూరు ఘటనపై మంత్రి మధు బంగారప్ప బుధవారం మాట్లాడుతూ ‘‘చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటం, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటాను.. మా శాఖ ద్వారా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాను”అని అన్నారు. అలా ప్రకటించిన తర్వాత రోజే మంత్రి సొంత జిల్లాలో తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. 

వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న స్టూడెంట్లు బ్రష్​లతో టాయిలెట్​లు క్లీన్ చేయడం కనిపిస్తుంది. తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై మంత్రి మధు బంగారప్ప స్పందించలేదు. అయితే ఈ ఘటన గత వారం జరగ్గా.. తాజాగా బయటపడింది. దీనిపై స్కూల్ హెడ్ మాస్టర్ వివరణ ఇస్తూ.. స్టూడెంట్లను టాయిలెట్​లో నీళ్లు సరిగా పోయమనిమాత్రమే చెప్పానని, క్లీన్ చేయమని ఆదేశించలేదని  చెప్పారు.