మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ మేయ ర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్‌గా కొత్త స్రవంతి గౌడ్ ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం 11 గంటలకు కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. మేయర్ అభ్యర్థిగా తోటకూర అజయ్ యాదవ్ ను కాంగ్రెస్ 17 డివిజన్ కార్పొరేటర్ పోగుల నరసింహరెడ్డి ప్రతిపాదించగా, 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేశ్ యాదవ్ బలపరిచారు. దీంతో సభ్యులు ఏకగ్రీవంగా కొత్త మేయర్ ను ఎన్నుకున్నారు.
అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించగా డిప్యూటీ మేయర్ గా 4 డివిజన్ కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ను 3 వ డివిజన్ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ప్రతిపాదించగా, 5 వ డివిజన్ సింగిరెడ్డి పద్మారెడ్డి బలపరిచారు. దీంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త మేయర్ మీడియాతో మాట్లాడుతూ.. బోడుప్పల్ లో ఇన్నాళ్లు అరాచక పాలన సాగిందని, ఇక నుంచి ప్రజా పాలన అందిస్తామన్నారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, మేడ్చల్ ఇన్ చార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్ సహకారంతో బోడుప్పల్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు.