ప్రాణం పోతున్నప్పుడు ఊపిరి అందినట్టుంది:కోదండరాం

ప్రాణం పోతున్నప్పుడు  ఊపిరి అందినట్టుంది:కోదండరాం
  • రాష్ట్రంలో ఆంక్షల సంకెళ్లు తెగాయ్
  • బీఆర్ఎస్ ప్రజాతీర్పును గౌరవిస్తలేదు
  • ఆ పార్టీ లీడర్ల వ్యాఖ్యలే నిదర్శనం
  • సామాన్యులకు నచ్చేలా రేవంత్ ప్రవర్తన
  • ఎన్నికల సమయంలో 2 ఎమ్మెల్సీ, కొన్ని చైర్మన్ పదవులకు హామీ
  • ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది
  • కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుంది
  • టైంకు జీతాలు రావడంతో ఉద్యోగులు హ్యాపీ
  • టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్: కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కితాబునిచ్చారు. ప్రాణం  పోతున్నప్పుడు ఊపిరి అందినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంక్షల సంకెళ్లు తెగిపోయాయని, ఉద్యోగులు వాట్సాప్ నిషేధించి.. నార్మల్ కాల్స్ మాట్లాడుకొనే సాధారణ పరిస్థితి వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్  నాయకులు ప్రజల తీర్పును గౌరవించడం లేదని, కుట్రలు చేసి మళ్లీ అధికారంలోకి వస్తామన్నట్టుగా ఆ పార్టీ నాయకుల కామెంట్లు ఉంటున్నాయని కోదండరాం విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన సామాన్యులకు నచ్చుతుందని చెప్పారు. ప్రగతి భవన్ కంచెలు తొలగించడం, సెక్రటేరియట్ లోకి సామాన్యులు వెళ్లేలా అవకాశం కల్పించడం మంచి పరిణామాలన్నారు. జీతాలు సమయానికి రావడం వల్ల ఉద్యోగులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తమకు రెండు ఎమ్మెల్సీ పదవులు, కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. చట్టసభల్లో చాలా అంశాలను ప్రస్తావించాల్సి ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. 

ఇప్పటి వరకు చేసిన పనికంటే ఇకపై చేసే పని ఎక్కువగా ఉందని చెప్పారు.  టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపికను కరెక్టుగా చేయాలని కోరారు. నిజాయితీ పరులకు అవకాశం కల్పించాలన్నారు. మంత్రి పదవిపై విలేకరులు ప్రస్తావించగా.. వాళ్లు ఇస్తామన్నప్పుడు మాట్లాడుదామంటూ కోదండరాం దాట వేశారు. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేస్తుందని, ఇందుకు సంబంధించిన కేసుల వివరాలను  ప్రభుత్వం సేకరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో వచ్చినట్టుగానే ఢిల్లీపాలనలోనూ మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. భద్రాచలం రాములవారి గుడిని  పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రపై ఉందని, వాళ్లు ఆ పనిచేయడం లేదని విమర్శించారు. కాజీపేటలో కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు.