డాక్టర్ల మెంటల్ హెల్త్ కోసం ఎడ్ టీ జూడా కనెక్ట్

డాక్టర్ల మెంటల్ హెల్త్ కోసం ఎడ్ టీ జూడా కనెక్ట్
  • మానసికంగా బాధపడుతున్న మెడికల్ స్టూడెంట్లు
  • ధైర్యం చెప్పి.. హ్యాపీగా ఉండేలా కౌన్సెలింగ్
  • సమస్య తీవ్రంగాఉంటే సైకియాట్రిస్ట్​కు రెఫర్
  • కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ స్టూడెంట్లు, రెసిడెంట్ డాక్టర్లు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ జూడా) ముందుకొచ్చింది. వారి కోసం ‘ఎడ్ టీ జూడా కనెక్ట్’ పేరుతో ఒక ప్రత్యేక హెల్ప్‌‌డెస్క్‌‌ ను ప్రారంభించింది. డాక్టర్లు గంటల తరబడి చదవడం, హాస్పిటళ్లలో పేషెంట్లను చూడటం, ర్యాగింగ్, కుటుంబ సమస్యలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 

ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 119 మంది వైద్య విద్యార్థులు (64 ఎంబీబీఎస్, 55 పీజీ) ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపేందుకు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ‘ఎడ్ టీ జూడా కనెక్ట్’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమ పోస్టర్​ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టీనా జడ్ చోంగ్తూ, టీపీసీసీ డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ ఎం.రాజీవ్, ఇతర ఉన్నతాధికారులు ఆవిష్కరించారు.

ఎడ్ టీ జూడా కనెక్ట్ ఎలా పనిచేస్తుందంటే..?

‘‘మేము వింటాం, పంచుకుంటాం, పరిష్కరిస్తాం’’అనేది ఈ కార్యక్రమం థీమ్. ఇది పూర్తిగా విద్యార్థులతోనే నడిచే వ్యవస్థ. ప్రతి మెడికల్ కాలేజీలో, ప్రతి బ్యాచ్ నుంచి ఇద్దరు విద్యార్థులు వాలంటీర్లుగా ఉంటారు. మానసికంగా ఇబ్బందిపడుతున్న వారిని గుర్తించి, వారితో మాట్లాడి ధైర్యం చెప్తారు. వారు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా అండగా ఉంటారు. ఆత్మహత్య ఆలోచనలు ఉంటే విరమించుకునేలా చేసి, హ్యాపీగా ఉండేలా వారికి కౌన్సెలింగ్ ఇస్తారు.

 సమస్య తీవ్రంగా ఉంటే.. నిపుణులైన సైకియాట్రిస్ట్‌‌ తో మాట్లాడటానికి సహాయం అందిస్తారు. సహాయం తీసుకున్న విద్యార్థుల వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు. మానసిక సమస్యలను ఇతరులతో పంచుకుంటే తగ్గుతాయన్న నమ్మకంతో టీ జూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.