మెదక్(కొల్చారం): తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రాగా హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆమె చనిపోయినట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెకు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి మృతి చెందారు. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన లక్ష్మీ రవిందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ టికెట్ లభించకపోవడంతో బీఎస్పీ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీపీసీసీ కార్యదర్శి పదవి ఇచ్చింది. సోమన్నగారి లక్ష్మీ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశ్ గౌడ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
