ఎలాన్ మస్క్‌కి ట్రంప్ వార్నింగ్.. దెబ్బకి సౌత్ ఆఫ్రికా తిరిగి పారిపోతావ్ అంటూ సీరియస్

ఎలాన్ మస్క్‌కి ట్రంప్ వార్నింగ్.. దెబ్బకి సౌత్ ఆఫ్రికా తిరిగి పారిపోతావ్ అంటూ సీరియస్

Trump Vs Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ కుబేరుడు, తన సన్నిహితుడిగా మెలిగిన బిలియనీర్ ఎలాన్ మస్క్ పై మరోసారి సీరియస్ అయ్యారు. కొన్నివారాల కిందట వీరిద్దరి మధ్య వచ్చిన విబేధాలు వారి స్నేహాన్ని విచ్ఛిన్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవి తిరిగి సర్థుమణుకుతున్న వేళ మరోసారి బంధానికి భీటలువారుతున్నాయి. 

అమెరికా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు నిలిపివేస్తే టెస్లా సీఈవో తిరిగి తన స్వస్థలమైన సౌత్ ఆఫ్రికా వెళ్లిపోతారంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. తాను ఎలక్ట్రిక్ వాహనాలకు వ్యతిరేకినని ఎలాన్ మస్క్ కి ఎప్పుడో తెలుసని ట్రంప్ అన్నారు. తనను అమెరికా అధ్యక్షుడిగా ప్రకటించటానికి ముందే అతనికి ఆ విషయం తెలుసన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తప్పు కానప్పటికీ ప్రతి ఒక్కరూ వాటినే వినియోగించాలనటం సరికాదన్నారు. ఇందుకోసం బలవంతం చేయరాదన్నారు. చరిత్రలో భూమిమీద ఎక్కువగా సబ్సిడీలు అందుకున్న వ్యక్తిగా మస్క్ నిలిచారన్నారు. 

ఇకపై రాకెట్ లాంచ్ లకు, శాటిలైట్లకు, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సబ్సిడీలు ఉండవన్నారు. ఇది అమెరికా సంపదను కాపాడుతుందని, రానున్న కాలంలో డోజీ విటిపై దృష్టిపెట్టి భారీగా డబ్బును ఆదా చేస్తుందని ఎలాన్ మస్క్‌కి ట్రంప్ నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. 

వాస్తవానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్ ట్రంప్ కి మరింత దూరంగా జరిగారు. ఈ నిర్ణయం రిపబ్లిక్ పార్టీ రాజకీయంగా ఆత్మహత్యకు గురిచేస్తుందని మస్క్ హెచ్చరించారు. ఒకవేళ అమెరికా సెనెట్ ఈ బిల్లుకు అనుమతిస్తే తాను వెంటనే కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతానని మస్క్ తేల్చి చెప్పారు. బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాతి రోజే కొత్త పార్టీతో వస్తానని తేల్చి చెప్పటం అమెరికాలో కొత్త రాజకీయ రగడకు దారితీసింది. ప్రస్తుతం ఉన్న రిపబ్లిక్, డెమోక్రట్ పార్టీలకు పోటీగా ప్రజల గొంతుకను వినిపించే మరో కొత్త పార్టీ అవసరమని ఈ సందర్బంగా మస్క్ వ్యాఖ్యానించారు.