- లేదంటే నవంబర్ 7న నిరసన దీక్ష
- టీఎస్‌జీఆర్‌ఈఏ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి
ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణ పెన్షనర్లకు సంబంధించి ప్రధానమైన నాలుగు డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్( టీఎస్‌జీఆర్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే నవంబర్ 7న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష చేపడుతామని హెచ్చరించారు. సోమవారం అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెక్రటరీ జనరల్ సి.చంద్రశేఖర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తమ డిమాండ్లపై పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించా పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వం రూ.390 కోట్లు కేటాయిస్తున్నట్లు కేబినెట్లో చెప్పిందని, పెన్షనర్లకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవన్నారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈహెచ్‌ఎస్ ద్వారా నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని, బెనిఫిట్స్‌ను క్లియర్ చేయాలని, పీఆర్‌సీని అమలు చేయాలని, ఐదు డీఆర్‌లను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పి.శ్యామ్‌రావు, లక్ష్మీనరసింహా రావు, గంగారెడ్డి, శంకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, ప్రహ్లాద రావు పాల్గొన్నారు.
బెనిఫిట్స్ చెల్లించాలి
పెన్షనర్స్ బెనిఫిట్స్ ను సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యనారాయణ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద పెన్షనర్లు నిరసన తెలిపారు. అనంతరం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ నర్సింగరావు, వెలిశోజు రామ మనోహర్, బి.నర్సయ్య మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన పెన్షనర్లందరికీ సత్వరమే బెనిఫిట్స్ చెల్లింపులు జరపాలన్నారు. నిరసనలో జి.లక్ష్మి, కాంతాభాయి, డి.అంజయ్య, ఎస్.యాదయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
