మార్చి 5 నుంచి ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ పరీక్షలు

 మార్చి 5 నుంచి ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ పరీక్షలు
  • 60 ఉద్యోగాలు, ఒక్కో పోస్టుకు 1:5 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక
  • సందేహాల నివృత్తికి ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూల్​ను రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌‌పీఆర్‌‌బీ) బుధవారం విడుదల చేసింది. మార్చి 5, 6, 7 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు తెలిపింది.ఈ మేరకు పరీక్షల నిర్వహణ వివరాలను బోర్డ్‌‌ చైర్మన్‌‌ వీవీ శ్రీనివాస రావు వెల్లడించారు.

60 పోస్టులకు గాను మొత్తం 4,664 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,760 మంది సర్టిఫికెట్‌‌ వెరిఫికేషన్‌‌కు హాజరైనట్టు తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేసినట్టు ప్రకటించారు. రాత పరీక్షకు ఎంపిక కాని అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ఒక్కో పోస్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి వివరణ కోవచ్చన్నారు. హాల్‌‌టికెట్లు తదితర వివరాలను వెబ్‌‌సైట్‌‌లో పెడతామన్నారు.