
= మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్
= జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు
= దారుస్సలాం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ యాదవ్
= ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం (అక్టోబర్ 16) జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కనుసన్నల్లో పని చేస్తున్నాయని అన్నారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి అవసరం లేదని అన్నారు.
కాంగ్రెస్ పారట్ఈ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు విపరీతంగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్ళుగా వీధిలైట్లు కూడా వేయలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా పోటీ చేసే ఎంఐఎం జూబ్లీహిల్స్ లో ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలని అన్నారు. దారుస్సలాం నిర్ణయించిన అభ్యర్థి కే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని, ఆ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఆ పార్టీ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. ఈరెండూ ఫిరాయింపు లను ప్రోత్సాహించే పార్టీలేనని అన్నారు. కుటుంబాలు , పార్టీ లో ఉండే కుటుంబాల కోసమే పనిచేస్తాయని విమర్శించారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మోరీలో చేసినట్లేనని, ఒక్క ఎంపీ సీటు కూడా ఆ పార్టీ గెలవలేదని అన్నారు.
బీజేపీని గెలిపించుకునేందుకు వచ్చే నెల 11 వరకు అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యకర్తల కోసం పూర్తి సమయంఇచ్చి పనిచేస్తున్న దీపక్ రెడ్డి ని గెలిపించుకోవాలని కోరారు. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. సభలు సమావేశాలు నిర్వహించడమే కాదని, జూబ్లీహిల్స్ ను పరిరరక్షించుకోవాలని అన్నారు. స్థానికంగా ఉన్న కార్యకర్తలకు సాయం చేసేందుకే మేం ఇక్కడికి వస్తున్నామని అన్నారు. ఇక్కడ ధర్మం, న్యాయం, ప్రజలు గెలవాలని పని చేయాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు పూర్తి సమయం ఇక్కడే ఉంటారన్నారు.