- రెండు వారాల్లో టెండర్లు పూర్తి చేస్తాం
- సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ
న్యూఢిల్లీ, వెలుగు: మామునూరు (వరంగల్) ఎయిర్‌పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పూర్తి చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) ఎయిర్ పోర్ట్‌ల పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో చాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని వివరించారు. హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు సీఎంకు తెలియజేశారు.
