V6 News

ఏడేండ్లుగా సాగుతున్న ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులు .. 2018లో రూ.425 కోట్లతో వర్క్స్ స్టార్ట్

 ఏడేండ్లుగా సాగుతున్న  ఉప్పల్  ఫ్లై ఓవర్ పనులు .. 2018లో రూ.425 కోట్లతో వర్క్స్ స్టార్ట్
  • ఆరేండ్లలో 46 శాతం పనులే పూర్తి 
  • 2026 అక్టోబర్ వరకు గడువు ఇచ్చినా కదలికలేదు
  • దుమ్ము, ధూళితో జనం పాట్లు
  • బ్యాంకు అప్పులు చెల్లించలేక కాంట్రాక్ట్​ సంస్థ దివాళా తీసినట్లు ప్రచారం

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్​ నుంచి వరంగల్​ వైపు వెళ్లే రహదారి ప్రయాణికుల ఓపికకు పరీక్ష పెడుతున్నది.  రోడ్డంతా పాత్​ హోల్స్​తో నిండిపోయాయి. ప్రతీ రోజు వెలువడే దుమ్ము, ధూళితో ప్రజలు నరకం చూస్తున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ఇప్పటికే పలువురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ట్రాఫిక్​ అంతరాయాన్ని నిర్మూలించడానికి 2018లో రూ.425 కోట్లతో చేపట్టిన  ఉప్పల్​ ఫ్లై ఓవర్​ పనులు ఏడేండ్లవుతున్నా ఇంకా పూర్తికాలేదు. గత సర్కారు హయాంలో 2020లోనే కంప్లీట్​ చేయాల్సిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

 గడిచిన ఆరేండ్లలో కేవలం 46 శాతం వర్క్స్​ మాత్రమే కంప్లీట్​ అయ్యాయి. నారపల్లి నుంచి ఉప్పల్​కు చేరుకోవడానికి కనీసం గంట సమయమైనా పడుతోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్​ సంస్థ బ్యాంకు అప్పులు చెల్లించలేక దివాళా తీసినట్టుగా ప్రచారం జరుగుతోంది.  కొత్త టెండర్లు పిలిస్తే ప్రభుత్వంపై రూ.200 కోట్ల భారం పడనుంది. దీంతో ఆదే కాంట్రాక్ట్​ సంస్థతో పనులు చేయించడానికి 2026 అక్టోబర్​ వరకు గడువిచ్చారు. 

6.25 కి.మీ దూరం నిర్మించాలి

హైదరాబాద్​–భూపాలపట్నం నేషనల్​ హైవే 163 పై ఉప్పల్​ నుంచి నారపల్లి మధ్యన గల 7.95 కి.మీ నుంచి 14.2 కి.మీ మధ్య మొత్తం 6.25 కి.మీ దూరం ఆరు లేన్ల ఫ్లై ఓవర్​ రోడ్డు  నిర్మాణానికి గత ప్రభుత్వం వర్క్​ ప్రపోజల్​ చేసింది. రాష్ట్ర ఆర్​ అండ్​ బీ శాఖ పరిధిలోని నేషనల్​ హైవే విభాగం టెండర్లు పిలిచింది. ప్రాజెక్ట్​ కాస్ట్​ రూ.626.76 కోట్లు కాగా గాయత్రి, ఓజోఎస్​సీ సిబ్​మోస్ట్​ కంపెనీలు జాయింట్​ వెంచర్​లో పనులు దక్కించుకున్నాయి. 2018 జులై 2 న వర్క్స్​ స్టార్ట్​ చేశారు.  జులై 2020 వరకు వర్క్​ కంప్లీట్ చేస్తామని గడువిచ్చారు.   గత సర్కారు వైఫల్యం కారణంగా పనులు చాలా స్లోగా జరిగాయి. దీంతో  మరో రెండేండ్ల గడువు పెంచారు.  నాలుగేండ్లు గడిచినా కూడా 46 శాతం వర్క్​ మాత్రమే కంప్లీట్​ చేశారు.  

కాంట్రాక్ట్​ సంస్థకు రూ.198 కోట్ల బిల్స్​ చెల్లించారు. మధ్యలో కాంట్రాక్ట్​ సంస్థ బ్యాంకు అప్పులు చెల్లించలేక దివాళా తీసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్ట్​ సంస్థ సైతం పనులు చేయలేమని ఎన్​హెచ్​ అధికారులకు లేఖలు రాసింది.  ఎన్​సీఎల్​టీ సంస్థకు సబ్​ కాంట్రాక్ట్​పై పనులు అప్పగిస్తామని కోరింది. 

2026 అక్టోబర్​ వరకు గడువు పెంపు 

ఉప్పల్​ ఫ్లై ఓవర్​ పెండింగ్​ పనులకు సంబంధించి కాంట్రాక్ట్​ సంస్థను తొలగించి కొత్తగా టెండర్లు పిలిస్తే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ప్రభుత్వంపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుందని ఎన్​హెచ్​ ఇంజినీర్లు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్​ సంస్థతోటే పనులు చేయించడానికి ఆ సంస్థపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా పనులు మొదలయ్యాయి. అనుకున్నంత వేగవంతంగా మాత్రం జరగట్లేదు. దీంతో ఇంకా 50 శాతానికి పైగా పనులు కేవలం 11 నెలల్లో కంప్లీట్​ చేస్తారా? అనే అనుమానాలను ప్రజలు వ్యక్త పరుస్తున్నారు.  

ట్రాఫిక్​ కష్టాలు, దుమ్ము ధూళితో ఇబ్బందులు

హైదరాబాద్​-వరంగల్​ హైవే రోడ్డుపై నిత్యం 60 వేలకు పైగా వెహికల్స్​ ప్రయాణిస్తుంటాయి.  నగరంలోనే అతి పెద్ద ట్రాఫిక్​ ఉండే ప్రాంతం ఇది. ఉప్పల్ జంక్షన్ నుంచి నారపల్లి వరకు వరంగల్, యాదాద్రి భువనగిరి, తూర్పు హైదరాబాద్ వైపు ట్రాఫిక్‌‌‌‌ను తగ్గించడానికి ఈ ఎలివేటేడ్​ కారిడార్​ రూపొందించారు. పీవీఎన్​ఆర్​ఎక్స్​ప్రెస్​ వే తర్వాత హైదరాబాద్​ నగరంలో అతి పొడవైన ఫ్లై ఓవర్​ ఇదే. ఎలివేటేడ్​ కారిడార్​కు సంబంధించిన పియర్స్​నిర్మాణంతో వెహికల్స్​రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 

పనుల ఆలస్యం కారణంగా పాత్​ హోల్స్​ ఏర్పడ్డాయి. నిత్యం, దుమ్ము ధూళి, ట్రాఫిక్​ డైవర్షన్ల కారణంగా ఈ ప్రాంతం ఆక్సిడెంట్​ ప్రోన్​ ఏరియాగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరిగి ఇప్పటికే పలువురు మరణించగా.. చాలా మంది గాయపడినట్టుగా పోలీస్​ రికార్డులు చెబుతున్నాయి. కాగా, ఉప్పల్​ఫ్లై ఓవర్​ సమస్యలపై స్థానికులు ఫేస్​బుక్, ట్విట్టర్, ఎక్స్​ ఖాతాలలో వందల సంఖ్యలో  పోస్టులు పెట్టారు. సోషల్​ మీడియాలో రీల్స్​ చేసి వైరల్ చేస్తున్నారు. 

నిత్యం నరకం అనుభవిస్తున్నం..

ఉప్పల్​ ఏరియాలో దుమ్ము, ధూళితో  నరకం అనుభవిస్తున్నం. చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు.  ఏడేండ్లవుతున్నా  పనులు కంప్లీట్​ చేయడం లేదు.  త్వరగా పనులు పూర్తి చేయించాలి. - తండా సమ్మయ్య, బోడుప్పల్

పనులు ​స్పీడప్​ చేస్తున్నం

ఉప్పల్​ఎలివేటెడ్​ కారిడార్​ పనులను కాంట్రాక్ట్​ సంస్థ రీ స్టార్ట్​ చేసింది. పనులు​స్పీడప్​ చేస్తున్నం. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తున్నం. గడువులోగా (2026 అక్టోబర్) పనులు కంప్లీట్​ చేసేలా చర్యలు తీసుకుంటున్నం. - జయభారతి, ఇన్​చార్జీ సీఈ, ఆర్​ అండ్​ బీ శాఖ ఎన్ హెచ్​ విభాగం, హైదరాబాద్​

 యాక్సిడెంట్లు జరుగుతున్నయ్​

ఉప్పల్​ ఫ్లై ఓవర్​ పనులు ఏడేండ్లుగా చేస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ప్రతీ రోజు  ట్రాఫిక్​ డైవర్షన్లు పెట్టడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  అనేక మంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. – సాయి వర్ధన్​, ఉప్పల్