అర్బన్లో ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు

అర్బన్లో ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు
  • సింగిల్​ బెడ్​ రూమ్​ ఇంటికి కనీసం రూ.15 లక్షలు కావాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇస్తున్నది రూ.5 లక్షలే
  • మిగతా రూ.10 లక్షలు లేక నిర్మాణానికి ముందుకురాని లబ్ధిదారులు
  • పీఎంఏవై కింద రాష్ట్రానికి 1.13 లక్షల ఇండ్లు మంజూరు
  • ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులు వెనకాడుతున్నారు. సర్కార్ సాయం చేస్తుందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఇంటి నిర్మాణం కోసం అధిక వ్యయం కావడమే ఇందుకు ప్రధాన కారణం. చేతిలో చిల్లిగవ్వ లేని పేదోల్లకు ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు ఏ మూలకూ సరిపోవట్లేదు. దీంతో ఇండ్లు మంజూరైనా నిర్మించుకునేందుకు లబ్ధిదారులు సాహసించడం లేదు. అంతేకాకుండా అర్బన్ ఏరియాల్లో సొంత జాగా ఉన్నవారు చాలా తక్కువ మంది ఉండటం, ఆ స్థలం కబ్జాకు గురికాకుండా కాపాడుకోవడం వారికి కత్తిమీద సాములా మారింది. 

భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం

పట్టణాల్లో ప్రస్తుతం 100 గజాల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి(జాగా ధర మినహాయిస్తే) కనీసం రూ.15 లక్షలు ఖర్చవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సాయం రూ.5 లక్షలే(కేంద్రం పీఎం ఆవాస్​యోజన కింద రూ.1.50 లక్షలు, రాష్ట్ర సర్కార్​రూ.3.50 లక్షలు) కావడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అందించే సాయం రూ.10 లక్షలు ఉంటే.. మిగతాది లబ్ధిదారులు భరించే అవకాశం ఉంటుందని హౌసింగ్ నిపుణులు చెబుతున్నారు. పీఎం ఆవాస్​యోజన కింద ఇచ్చే సాయాన్ని పెంచాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నా కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

లబ్ధిదారులను కలవనున్న ఆఫీసర్లు

తెలంగాణకు పీఎం ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం 1.13 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. అర్బన్ ఏరియాల్లో  రెండున్నర లక్షల మంది అర్హులను గుర్తించిన హౌసింగ్ అధికారులు వారిని పేర్లను కేంద్రానికి పంపించారు. వీరిలో సుమారు 50 శాతం మందికి ఇండ్లు మంజూరయ్యాయి. అయితే, అర్బన్ ప్రాంతాల్లో సొంత జాగా ఉన్న లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావటం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇండ్లు మంజూరైనా పనులు మొదలుపెట్టకపోవడంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లి, ఇల్లు కట్టుకుంటారా లేక క్యాన్సిల్ చేసి వేరే వాళ్లకు ఇవ్వమంటారా.. అని వివరణ కోరేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేసింది.

అర్బన్ ప్రాంతాలు లేని నియోజకవర్గాల్లో ఎక్కువగా గ్రామాలకే వీటిని కేటాయించారు. అర్బన్ ఏరియాలు ఉన్న నియోజకవర్గాల్లో సొంత జాగా ఉన్న లబ్ధిదారులు తక్కువ మందే ఉన్నారని అధికారులు అంటున్నారు. మరోవైపు ఇటీవల హౌసింగ్ ఆఫీసర్లు పంపిన జాబితాలో మరో 18 వేల ఇండ్లకు కేంద్రం ఓకే చెప్పింది. వీటికి సంబంధించి రూ.110 కోట్లు రానున్నాయి. పట్టణాల్లో సొంత జాగా ఉన్నోళ్లు దొరక్కపోవడం, ఉన్నా డబ్బులు చాలక నిర్మించుకునేందుకు ముందుకు రాకపోవడం ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది.