సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం, రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్నాయి. ఇవి వారం పొడవునా 100 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ రేటుతో నడుస్తున్నాయి.

డిమాండ్‌ కారణంగా ఈ రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోతున్నాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) తెలిపింది. ఈ రెండు సర్వీసులు విజయవంతం కావడంతో వచ్చే కొద్ది నెలల్లో సికింద్రాబాద్ - నాగ్‌పూర్ మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు తెలిస్తోంది. భారతీయ రైల్వే SCR అధికారులతో కలిసి ఈ సేవలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్, నాగ్‌పూర్ మధ్య ఇప్పటికే దాదాపు 25 రైళ్లు నడుస్తున్నాయి. రెండు నగరాలు వాణిజ్య, వ్యాపార కేంద్రాలు. అయితే, అన్నీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూపర్‌ఫాస్ట్ రైళ్లు కాదు. రెండు నగరాల మధ్య చాలా వాణిజ్యం జరుగుతుంది. సాధారణ ప్యాసింజర్ రైళ్ల ప్రయాణ సమయం సుమారు 10 గంటలు. అదే వందే భారత్ రైలు ఆ ప్రయాణ సమయాన్ని 6.30 గంటలకు తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య దూరం దాదాపు 581 కి.మీ. సాధారణంగా ఈ దూరాన్ని అధిగమించడానికి 10 గంటలు పడుతుంది. ఇప్పుడు భారతీయ రైల్వే కొత్త వందే భారత్ రైలును ప్రవేశపెట్టడం ద్వారా సమయాన్ని 10 గంటల నుండి 6.30 గంటలకు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, రామగుండం, సిర్పూర్ ఖగజ్ నగర్, బలార్షా మీదుగా ఈ రైలును నడపాలని భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.