ODI World Cup 2023: ఆ విషయంలో బుమ్రా నా కంటే గొప్ప బౌలర్: వసీం అక్రమ్

ODI World Cup 2023: ఆ విషయంలో బుమ్రా నా కంటే గొప్ప బౌలర్: వసీం అక్రమ్

టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా వరల్డ్ క్రికెట్ లో తన సత్తా చూపిస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ కప్ కప్ బరిలోకి దిగిన ఈ స్టార్ పేసర్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా బుమ్రా బౌలింగ్ కు ఇంప్రెస్ అయిన  పాక్ దిగ్గజ బౌలర్.. పొగడ్తల వర్షం కురిపించాడు. 

సాధారణంగా బాగా బౌలింగ్ వేసినప్పుడు  ప్రశంసించడం సహజమే అయినప్పటికీ వసీం అక్రమ్ మాత్రం తన కన్నా బుమ్రా గొప్ప బౌలర్ అని చెప్పుకొని రావడం ఆశ్చర్యంగా మారింది. ఇప్పటివరకు వన్డేల్లో 500 కు పైగా వికెట్లు, టెస్టుల్లో 400 పైగా వికెట్లు తీసిన ఒక దిగ్గజ బౌలర్ ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చాడంటే బుమ్రా ఏ రేంజ్ లో బౌలింగ్ చేస్తున్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు.
 
ఈ సందర్భంగా వసీం అక్రం మాట్లాడుతూ "బుమ్రా పవర్ ప్లే లో బౌలింగ్ చేసే విధానం నాకు ఎంతగానో నచ్చుతుంది. అతడు బంతిని రెండువైపులా స్వింగ్ చేయడంతో పాటు బ్యాటర్ కదలికలను సరిగ్గా అంచనా వేస్తాడు. పవర్ ప్లేలో బుమ్రా నాకంటే మెరుగైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు". అని ఈదిగ్గజా బౌలర్ చెప్పుకొచ్చాడు.  

కాగా.. బుమ్రా నిన్న ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో  3 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. బుమ్రా దెబ్బకు తొలి రెండు వికెట్లను కోల్పోయింది. ఇక ఈ వరల్డ్ కప్ లో మొత్తం 6 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియా బౌలర్ జంపా(16) తర్వాత అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు.