బెంగళూరులో మాజీ డాన్ కొడుకు లంబోర్ఘిని కారుతో చేసిన హంగామా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఓ కాస్ట్లీ లంబోర్ఘిని కారుతో ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ స్టంట్స్ చేసింది దివంగత మాజీ అండర్‌వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కుమారుడు రికీ రాయ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లగ్జరీ కారు రోడ్డు మధ్యలో అతివేగంగా డ్రిఫ్టింగ్ చేస్తూ, చెక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారు లోపల ఉన్నవారు సన్‌రూఫ్ నుండి బయటకు వచ్చి అరుస్తుండటం కనిపిస్తుంది.
దీనిపై కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ఆ లంబోర్ఘిని కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే విచారణకు హాజరు కావాలని రికీ రాయ్‌కి నోటీసులు కూడా ఇచ్చారు.
నిర్లక్ష్యంగా కారు నడపడం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) బుక్ చేశారు. అయితే ఆ సమయంలో కారు నడిపింది రికీ రాయేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
అసలు ఆ కారు ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడానికి ఆర్టీఓ (RTO) అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి కారు పోలీసుల ఆధీనంలో ఉండగా.. విచారణ చేస్తున్నారు.
