ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ కోసం 'ఆఫ్టర్ రీడింగ్' అనే అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీనివల్ల మీరు పంపే మెసేజ్‌లు అవతలి వారు చూడగానే వాటంతట అవే డిలీట్ అయిపోతాయి.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే
మీరు పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి ఓపెన్ చేసి చదివిన 15 నిమిషాల తర్వాత, ఆ మెసేజ్ ఇద్దరి ఫోన్ల నుండి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ అవతలి వారు ఆ మెసేజ్‌ను చూడకపోతే, అది కేవలం 24 గంటల పాటు మాత్రమే చాట్‌లో ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే మాయమవుతుంది. మీరు రీడ్ రిసీప్ట్స్ అంటే బ్లు టిక్స్ ఆఫ్ చేసినా సరే, ఈ ఫీచర్ పని చేస్తుంది.
దీని వల్ల లాభం ఏంటంటే
సాధారణంగా మనం ఎవరికైనా బ్యాంక్ వివరాలు, OTPలు (ఓటీపీ), పాస్‌వర్డ్‌లు లేదా పర్సనల్ సమాచారం పంపినప్పుడు అవి చాట్ హిస్టరీలో ఉండిపోతాయి. ఈ కొత్త ఫీచర్ వల్ల ముఖ్యమైన లేదా పర్సనల్ వివరాలు ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం తగ్గుతుంది. ఇంకా చాట్ బాక్స్ ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. మనం పాత మెసేజ్‌లను వెతికి డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.26.12.2)లో టెస్టింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఉన్న వ్యూ వన్స్ (ఫోటోలు, వీడియోలు ఒక్కసారి ఓపెన్ చేస్తే మాయమయ్యే ఫీచర్) లాగే, ఇది టెక్స్ట్ మెసేజ్‌ల కోసం తీసుకొస్తున్న అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది కాబట్టి, త్వరలోనే సాధారణ వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రావచ్చు.
