- తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి: ఆది శ్రీనివాస్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మారని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఆనాడు తల్లిని చంపి, బిడ్డను బతికించారని మోదీ చేసిన వ్యాఖ్యలే... నేడు సూర్య విమర్శలకు దోహదపడ్డాయని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు రాజేందర్, నాగరాజు, బసవరాజు సారయ్యలతో కలిసి ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తేజస్వితో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ క్షమాపణ చెప్పించాలని, లేదంటే మిమ్మల్ని, రాష్ట్రానికి చెందిన మీ పార్టీ ఎంపీలను తెలంగాణ సమాజం ద్రోహులుగా చూస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రాష్ట్రానికి తల్లి అయితే.. తనను చిన్నమ్యగా చూడాలని ఆనాడు సుష్మ స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచించిన హైబ్రీబ్ ఫార్మూలను తేజస్వి చులకన చేయడంపై మండిపడ్డారు. బీజేపీకి మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. 2024 ఎన్నికల్లోనే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అప్పుడే చేసి ఉంటే... ప్రస్తుతం 181 మంది మహిళలు లోక్‌సభలో ఉండేవాళ్లని గుర్తుచేశారు.

