అద్భుతమైన రాధానగర్ బీచ్ !.. ఆసియాలోనే స్వర్గం లాంటి ఈ బెస్ట్ బీచ్ ఎక్కడ ఉందొ తెలుసా...

 అద్భుతమైన రాధానగర్ బీచ్ !.. ఆసియాలోనే స్వర్గం లాంటి ఈ బెస్ట్ బీచ్ ఎక్కడ ఉందొ తెలుసా...

ఆసియాలోనే బెస్ట్ బీచ్ అనగానే మనకు థాయ్‌లాండ్ లేదా బాలి గుర్తుకు వస్తాయి. కానీ, మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవులలో అచ్చం అలాంటి అందమైన బీచ్ ఒకటి ఉంది. అదే స్వరాజ్ ద్వీపంలో ఉన్న రాధానగర్ బీచ్. తెల్లని ఇసుక, స్వచ్ఛమైన నీలం రంగు నీరు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ  బీచ్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ మధ్య ఈ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున జాతీయ జెండాను ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడంతో దీని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

ఈ బీచ్ ఎందుకు అంత ప్రత్యేకం 
*2004లోనే 'టైమ్ మ్యాగజైన్' దీనిని ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా ప్రకటించింది.
*పర్యావరణం, పరిశుభ్రత, భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నందుకుగానూ దీనికి 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ గుర్తింపు లభించింది.
*ఇక్కడి పచ్చని అడవులు, నీలి సముద్రం కలిసే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

*రాధానగర్ బీచ్ వాటర్ అడ్వెంచర్స్  కంటే ప్రశాంతతను కోరుకునే వారికి స్వర్గంలాంటిది. ఇక్కడి నీరు ఈత కొట్టడానికి చాలా సురక్షితంగా ఉంటుంది. బీచ్ లో ఎండలో సేదతీరుతూ హాయిగా గడపవచ్చు. ఈ బీచ్ సూర్యాస్తమయ దృశ్యాలకు పెట్టింది పేరు. సాయంత్రం 4 గంటలకల్లా బీచ్ చేరుకుంటే ఆకాశంలో రంగులు మారే అద్భుతాన్ని చూడవచ్చు.  తెల్లవారుజామున బీచ్ వెంబడి నడుస్తూ ఉంటే ప్రకృతిని  గొప్ప అనుభూతినిస్తుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి  ఈ బీచ్  మంచి ప్రదేశం.  

చూడటానికి బెస్ట్ టైం 
అక్టోబర్ నుండి మే నెల మధ్య కాలం ఇక్కడ పర్యటించడానికి చాలా బాగుంటుంది. వాతావరణం చల్లగా, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో బీచ్ అందాలు రెట్టింపు అవుతాయి.

వెళ్లడం ఎలా?
రాధానగర్ బీచ్ చేరుకోవడానికి రెండు మార్గాలు  ఉన్నాయి:

1. పోర్ట్ బ్లెయిర్ నుండి :
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుండి పోర్ట్ బ్లెయిర్‌కు నేరుగా విమానాలు ఉన్నాయి. ఇంకా షిప్ ద్వారా కూడా వెళ్లవచ్చు కానీ విమానం ప్రయాణం త్వరగా  ఉంటుంది.

2. హేవ్‌లాక్ ద్వీపానికి (స్వరాజ్ ద్వీప్):
పోర్ట్ బ్లెయిర్ నుండి ప్రైవేట్ లేదా ప్రభుత్వ  బోట్ల ద్వారా 90 నిమిషాల నుండి 3 గంటల్లో హేవ్‌లాక్ చేరుకోవచ్చు. ఇంకా వేగంగా వెళ్లాలంటే సీ ప్లేన్ సౌకర్యం కూడా ఉంది.  దీని ద్వారా కేవలం 20 నిమిషాలలో చేరుకోవచ్చు.

హేవ్‌లాక్ జెట్టీ నుండి రాధానగర్ బీచ్ 12 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడి నుండి ఆటోలు, టాక్సీలు లేదా స్కూటర్ల ద్వారా 20 నిమిషాల్లో బీచ్ చేరుకోవచ్చు. విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా, పాస్‌పోర్ట్ కూడా అడగకుండా మన దేశంలోనే ఉన్న ఈ అద్భుత తీరాన్ని తప్పక చూడండి..!