మహిళలు జాగ్రత్త! మీ గుండె ఇచ్చే ఈ లక్షణాలను లైట్ తీసుకొకండి.. అది గుండెపోటు కావచ్చు..

 మహిళలు జాగ్రత్త! మీ గుండె ఇచ్చే ఈ లక్షణాలను లైట్ తీసుకొకండి.. అది గుండెపోటు కావచ్చు..

37 ఏళ్ల ఓ మహిళా కడుపులో గ్యాస్ సమస్యగా ఉందని డాక్టరు దగ్గరకు వెళ్ళింది. ఆమెకు గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, వీపులో కాస్త  నొప్పి మాత్రమే ఉంది. ఇవన్నీ వయస్సు పెరగడం వల్ల వచ్చే మార్పులేనని ఆమె అనుకుంది. కానీ, డాక్టరుకి అనుమానం వచ్చి ECG, ట్రోపోనిన్ పరీక్షలు చేయగా.. ఆమెకు అప్పటికే గుండెపోటు అని తేలింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమెకు గుండెపోటు వచ్చినప్పుడు ఉండాల్సిన సాధారణ లక్షణాలు  ఛాతీ నొప్పి, చెమటలు పట్టడం, దవడ నొప్పి ఏవీ లేవు. ఆమె గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమని (LAD) లో అడ్డంకి ఏర్పడింది. లోతైన పరీక్షల్లో ఆమెకు PCOS (పిసిఓఎస్) ఉన్నట్లు తేలింది.

గమనించాల్సిన  విషయాలు:
మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నంగా, చాలా నిశ్శబ్దంగా ఉంటాయి.
*చిన్న పని చేసినా ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా నీరసించిపోవడం.
*ఛాతీలో నొప్పి లేకపోయినా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించడం.
*దవడ, మెడ లేదా వీపు భాగంలో నొప్పి రావడం 
*కడుపులో అసౌకర్యం, మంట లేదా గ్యాస్ సమస్యలా అనిపించడం.

ప్రమాదం ఎక్కువ:
భారతదేశంలో 15-49 ఏళ్ల వయస్సుగల ఐదుగురు మహిళల్లో ఒకరికి రక్తపోటు (BP) సమస్య ఉంది. డయాబెటిస్ (షుగర్) ఉన్న మహిళలకు పురుషుల కంటే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. PCOS ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత, అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. సాధారణంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ మహిళల గుండెకు రక్షణ ఇస్తుంది. కానీ, ధూమపానం, మద్యం, ఒత్తిడి వంటి అలవాట్లు ఉంటే ఆ రక్షణ పనిచేయదు.

 పురుషులకు, మహిళలకు తేడా ఏంటి?
పురుషుల్లో  ధమనులలో కొవ్వు గడ్డలు (Plaque) ఒక్కసారిగా పగిలిపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. అదే మహిళల్లో ధమనులలోని కొవ్వు గడ్డలు మెల్లమెల్లగా అరిగిపోవడం (Erosion) వల్ల రక్తం గడ్డకడుతుంది. అందుకే లక్షణాలు చాలా నెమ్మదిగా, అస్పష్టంగా ఉంటాయి.

జాగ్రత్తలు, నివారణ:
*మొదటిసారిగా అనిపించే ఏ కొత్త లక్షణామైన..అంటే  ఎక్కువగా అలసట, కడుపు నొప్పి, వీపు నొప్పి ఇలాంటివి  కేవలం గ్యాస్ లేదా హార్మోన్ సమస్యగా భావించకండి. అలాగే వెంటనే డాక్టరును సంప్రదించండి.

*ఎప్పటికప్పుడు తప్పకుండా  20 ఏళ్ల వయస్సు నుంచే బీపీ, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి.

*కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే 30 ఏళ్లు దాటాక తప్పనిసరిగా ECG, Echo, Stress Test వంటివి చేయించుకోవాలి.

*ఒత్తిడి తగ్గించుకోవడం, పౌష్టికాహారం, రోజు తప్పకుండ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. 

గుర్తుంచుకోండి రొమ్ము క్యాన్సర్ కంటే గుండె జబ్బుల వల్లే మహిళల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ పెట్టడం అలస్యం చేయకండి.