హాంకాంగ్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ (BA32) విమానంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన గంట సేపటికే 60 ఏళ్ల ఓ మహిళ చనిపోయింది. అయితే, విమానాన్ని ఎక్కడా ఆపకుండా, దాదాపు 13 గంటల పాటు ఆమె మృతదేహంతోనే ప్రయాణాన్ని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే.. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఆ మహిళ మృతి చెందింది. సాధారణంగా విమానంలో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ కింద విమానాన్ని దగ్గర్లోని విమానాశ్రయంలో దించేస్తారు. కానీ, ప్రయాణికుడు అప్పటికే చనిపోతే దాన్ని ఎమర్జెన్సీగా పరిగణించరు. అందుకే పైలట్లు విమానాన్ని వెనక్కి తిప్పకుండా లండన్ వైపు తీసుకెళ్లారు. మొదట మృతదేహాన్ని టాయిలెట్‌లో ఉంచాలని సిబ్బంది అనుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదని భావించి, విమానం వెనుక భాగంలో ఉండే 'గ్యాలీ' నేలపై పడుకోబెట్టి దుప్పటి కప్పారు. ఆ సమయంలో విమానంలో 331 మంది ప్రయాణికులు ఉన్నారు.
దుర్వాసనతో ప్రయాణికుల ఇబ్బందులు:
దురదృష్టవశాత్తూ, ఆ మృతదేహాన్ని ఉంచిన చోట కింద వేడిగా ఉంది. విమానం వెళ్తున్న కొద్దీ ఆ వేడి వల్ల మృతదేహం నుంచి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. విమానం వెనుక భాగమంతా ఆ వాసన వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులు కూడా విమానంలోనే ఉండటంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరికి విమానం లండన్ చేరుకున్నాక, పోలీసులు లోపలికి వచ్చి చెక్ చేసే వరకు ప్రయాణికులెవరినీ కిందకు దిగనివ్వలేదు. దాదాపు 45 నిమిషాల పాటు అందరూ సీట్లలోనే కూర్చోవాల్సి వచ్చింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి:
ఇలాంటి సమయాల్లో అంతర్జాతీయ నిబంధనల (IATA) ప్రకారం.. మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా ఖాళీ సీటులో ఉంచాలి. ఒకవేళ విమానం ఫుల్ ఉంటే, తిరిగి అదే సీటులోనే ఉంచి దుప్పటి కప్పాలి. దీనికి సంబంధించి బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాత్రం అన్ని రూల్స్ కరెక్ట్‌గానే పాటించామని చెబుతోంది.
