మహిళాభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ ..మహిళా సంఘాలకు చేప పిల్లల పెంపకం బాధ్యతలు: డిప్యూటీ సీఎం భట్టి

మహిళాభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ ..మహిళా సంఘాలకు చేప పిల్లల పెంపకం బాధ్యతలు: డిప్యూటీ సీఎం భట్టి
  • అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్ల ఏర్పాటుకు యోచన
  • మహిళలను కోటీశ్వరులుగా చేయడమే మా లక్ష్యం: సీతక్క
  • వందల సంఖ్యలో మొబైల్ ఫిష్ ఔట్​లెట్​ వాహనాలు ఇస్తం: వాకిటి శ్రీహరి
  • ప్రజాభవన్‌‌లో చేపల విక్రయ వాహనాల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్​గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్​లో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణకి వచ్చే పరిస్థితిని ఉందన్నారు. 

రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి రూ.122 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని చెప్పారు. అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్ర మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని ప్రపంచంతో పోటీ పడాలని పిలుపునిచ్చారు. 

 మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించి మొదటి ఏడాదిలోనే రూ.21,600 కోట్ల పంపిణీ చేశామన్నారు. హైటెక్ సిటీ పక్కన శిల్పారామం వద్ద విలువైన స్థలాన్ని మహిళా సంఘాలకు ఇచ్చి ఆర్థికంగా వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

 మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారి తో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయించి ప్రభుత్వమే వారి నుంచి కరెంటు  కొనుగోలు చేసి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేపట్టిందన్నారు. హైదరాబాద్‌లో మహిళల చేత పెద్ద ఎత్తున  వ్యాపారం చేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.  

వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నం: సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘‘మహిళలను కోటీశ్వరులుగా చేయడమే మా లక్ష్యం. ఇందుకోసం 20కి పైగా వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలుస్తున్నాం’’ అని అన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్‌‌మెంట్ కంపెనీల ద్వారా మహిళలకు ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుకోని ఘటనల్లో మరణించిన మహిళా సంఘ సభ్యుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా, 2 లక్షల వరకు రుణ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.  

మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, చేపల పరిశ్రమ ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికి దోహదపడుతున్నామని చెప్పారు.  మత్స్యపరిశ్రమ అభివృద్ధికి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని, త్వరలో వందల సంఖ్యలో మొబైల్ ఫిష్ ఔట్​లెట్ లుపంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సెర్ఫ్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు.