కేరళలో జికా వైరస్ కలకలం: హైఅలర్ట్ ప్రకటన

కేరళలో జికా వైరస్ కలకలం: హైఅలర్ట్ ప్రకటన
  • 28కి చేరిన జికా వైరస్ కేసులు

తిరువనంతపురం: కరోనా కేసుల నుంచి కోలుకోలేక సతమతం అవుతున్న కేరళ రాష్ట్రంలో  జికా వైరస్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గురువారం 5 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 28కి చేరింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించింది. జికా వైరస్ గుర్తించిన ప్రాంతాల్లో మూడు  కిలోమీటర్ల వరకు జికా వైరస్ క్లస్టర్లుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
గురువారం బయటపడిన 5కొత్త జికా వైరస్ కేసు బాధితుల్లో నలుగురు మహిళలే ఉన్నారని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. జికా వైరస్ సోకిన బాధితుల్లో ఇద్దరు రాజధాని తిరువనంతపురంలోని అయనారా ప్రాంతానికి చెందిన వారు కాగా మిగిలిన వారు తూర్పుకోట, కనుకుళి పట్టోమ్ నుండి వచ్చిన వారుగా గుర్తించామన్నారు. అలప్పుజా లోని వైరాలజీ ల్యాబ్ లో పరీక్షలు చేయగా జికా వైరస్ గా నిర్ధారణ అయిందని ఆమె చెప్పారు. జికా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన ప్రాంతాలను జికా వైరస్ క్లస్టర్లుగా ప్రకటించి కట్టడి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వీణా జార్జ్ తెలిపారు.