ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తా

ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తా

హల్ద్వానీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. యూపీలో యోగి నేతృత్వంలోని బీజేపీని ఓడించాలని విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీని ఓడించాలని ప్రతిపక్షాలు ప్లాన్‌లు వేస్తున్నాయి. ఢిల్లీలో అధికార పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూపీలో తమ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయబోయే అభ్యర్థుల వివరాలను ప్రకటించిన ఆప్.. ఉత్తరాఖండ్ విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తోంది.  హల్ద్వానీలో పర్యటించిన కేజ్రీవాల్ వరాల జల్లులు ప్రకటించారు. 

ఉత్తరాఖండ్‌లో తమను గెలిపిస్తే ఆరు నెలల్లో లక్ష జాబ్స్ ఇస్తామని కేజ్రీ చెప్పారు. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు భృతి ఇస్తామని, ఉద్యోగాల్లో 80 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడంతో యువత ఇతర రాష్ట్రాలకు పోతోందని, కానీ తమను గెలిపిస్తే వారికి స్థానికంగా జాబ్స్ ఇస్తామన్నారు. నిరుద్యోగం లాంటి సమస్యలను పరిష్కరించడంపై స్పష్టత ఉన్న తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.