- ఎనిమిదేండ్లలో 70 శాతం పెరిగింది: రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెరుగుతోందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 100 మిలియన్ల(10 కోట్ల) మంది డ్రగ్స్‌కు బానిసలయ్యారన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో దేశంలో డ్రగ్స్ వాడకం 70 శాతం పెరిగిందని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.
మాదక ద్రవ్యాల నివారణకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ డ్రగ్స్ స్థాయి మరింత పెరిగిపోయిందన్నారు. ఇది దేశ యువత-, జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అందువల్ల ఈ అంశంపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్య కేవలం వైద్యపరమైనది కాదని, కౌమారదశలో ఉన్నవారిలో ఈ వ్యసనం సర్వసాధారణంగా మారుతోందని లక్ష్మణ్ అన్నారు. డ్రగ్స్ కారణంగా హింసాత్మక, ఆర్థిక నేరాల పెరిగిపోతోన్న దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా అధిక- ప్రమాదకర జిల్లాల్లో పునరావాస కేంద్రాలను విస్తరించాలన్నారు.
