బ్రిటన్ నుంచి వచ్చేటోళ్లకు 10 రోజుల క్వారంటైన్

బ్రిటన్ నుంచి వచ్చేటోళ్లకు 10 రోజుల క్వారంటైన్
  • బ్రిటన్ నుంచి వచ్చేటోళ్లకు 10 రోజుల క్వారంటైన్
  • మనోళ్లపై వివక్ష చూపిన యూకేకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన కేంద్రం 
  •  మూడుసార్లు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కూడా మస్ట్ అని ప్రకటన


న్యూఢిల్లీ:‘‘ఇండియాతో పాటు పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా.. టీకా వేసుకోనట్లే. మా దేశానికి వచ్చే ఇండియన్లు, ఆయా దేశాల ప్రజలు10 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాల్సిందే..” అంటూ వివక్షతో కూడిన రూల్స్ పెట్టిన బ్రిటన్ కు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇండియాకు వచ్చే బ్రిటన్ పౌరులు మూడుసార్లు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసుకోవాలని, కచ్చితంగా 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ప్రకటించింది. సోమవారం నుంచే ఈ రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. ‘‘ఈ నెల 4వ తేదీ నుంచి ఇండియాకు వచ్చే యూకే పౌరులు వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోకపోయినా మూడు సార్లు టెస్టులు చేసుకోవాలి. ఇండియాకు రావడానికి 72 గంటల ముందు ఒకసారి, వచ్చాక ఎయిర్ పోర్టులో రెండోసారి, దేశంలోకి వచ్చిన తర్వాత 8వ రోజున ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేస్కోవాలి. అలాగే ఇండియాలో మరోసారి వాళ్లు బస చేసే ఇల్లు లేదా హోటల్​లో 10 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలి” అని కేంద్రం రూల్స్ పెట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

సర్టిఫికెట్ పేరిట బ్రిటన్ వివక్ష.. 

అమెరికా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా తదితర దేశాల పౌరులు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే ఈ నెల 4 నుంచి తమ దేశానికి వచ్చాక క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదంటూ బ్రిటన్ పోయిన నెలలో కొత్త రూల్స్ ప్రకటించింది. అయితే ఇండియాతో సహా అనేక దేశాల్లో కొవిషీల్డ్ టీకా వేసుకున్నా, క్వారంటైన్​లో ఉండాల్సిందేనని కండిషన్ పెట్టింది. కొవిషీల్డ్ టీకాకు బ్రిటన్ ఆమోదం ఉన్నా, కొన్ని దేశాల్లో వేసుకుంటే గుర్తించకపోవడం వివక్షేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీకాతో తమకు సమస్య లేదని, ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్ సర్టిఫికెట్లపైనే అనుమానాలు ఉన్నాయంటూ బ్రిటన్ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ రూల్స్ పెడుతూ తాజాగా కౌంటర్ ఇచ్చింది.