గెలిస్తే 10 లక్షల జాబ్స్ ఇస్తం

గెలిస్తే 10 లక్షల జాబ్స్ ఇస్తం

పాట్నా: ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాకూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో రద్దు చేస్తామని ప్రకటించింది. ‘బద్లావ్ కా సంకల్ప్ (కమిట్​మెంట్ టు చేంజ్)’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రణ్​దీప్ సింగ్ సుర్జేవాలా, ఇతర నేతలతో కలిసి కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ విడుదల చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ముందుగా 10 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని తేజస్వీ చెప్పారు. తర్వాత రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ‘‘చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు న్యాయం చేస్తాం. వారికి ఒకే పనికి ఒకే వేతనం లభిస్తుంది’’ అని ప్రకటించారు. 15 ఏండ్లుగా బీహార్​లో నితీశ్ కుమార్ పాలన చేస్తున్నా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి రాడంటూ ఎగతాళి చేశారు. నితీశ్ హయాంలో బీహార్​లో 60 కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.

మహాకూటమి హామీలివీ..

  •     10 లక్షల ఉద్యోగాల కల్పన.
  •     రైతు రుణాల మాఫీ.
  •     కాంట్రాక్టు టీచర్లకు ఒకే పని, ఒకే వేతనం.
  •     ఉద్యోగాల కోసం పోటీ పడే వారికి పరీక్ష ఫీజు మాఫీ.
  •     మైగ్రెంట్ వర్కర్ల కోసం హెల్ప్‌‌‌‌లైన్.
  •     పరీక్ష కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.
  •     బడ్జెట్ లో 12 శాతం విద్యకు కేటాయింపు.
  •     ప్రైమరీ స్కూళ్లలో ప్రతి 30 మంది స్టూడెంట్లకు ఒక టీచర్, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 35 మంది స్టూడెంట్లకు ఒక టీచర్.
  •     ‘స్మార్ట్ గ్రామ యోజన’ కింద ప్రతి పంచాయతీలో డాక్టర్, నర్సులతో క్లినిక్స్.