న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ బ్లాస్ట్‌తో లింకులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానాలోని అల్ ఫలాహ్ యూనిర్శిటీలో 10 మంది కనిపించకుండా పోయారు. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అల్ ఫలాహ్ వర్శిటీలో 10 మంది అదృశ్యమయ్యారని నిఘా వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
10 మంది ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తోన్నట్లు సమాచారం. కనిపించకుండా పోయిన 10 మందిలో ముగ్గురు కశ్మీరీలు ఉన్నారు. అదృశ్యమైన 10 మంది 'టెర్రర్ డాక్టర్' మాడ్యూల్‌లో భాగమై ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసుల జాయింట్ ఆపరేషన్ తర్వాత 10 మంది మిస్సింగ్ వెలుగులోకి వచ్చింది.
2025, నవంబర్ 11న భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.
►ALSO READ | NIA కస్టడీలో గ్యాంగ్‌స్టర్.. అన్మోల్ బిష్ణోయ్ కి 11 రోజుల రిమాండ్
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్శిటీ నుంచే ఈ దాడికి కుట్ర పన్నినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఇందులో భాగంగానే అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీకి చెందిన సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో పాటు మరో తొమ్మిది మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. మరోవైపు.. మనీలాండరింగ్ ఆరోపణలపై అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు జావాద్ అహ్మద్ సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది.
