పది నెలలాయే.. బిల్లులిస్తలేరు : కమలాపూర్​ మండల సభలో సర్పంచులు

పది నెలలాయే.. బిల్లులిస్తలేరు : కమలాపూర్​ మండల సభలో సర్పంచులు
  • కమలాపూర్​ మండల సభలో సర్పంచుల ఆవేదన

కమలాపూర్, వెలుగు: తెలంగాణ క్రీడా మైదానాల పనులు చేసి పది నెలలు దాటినా పది పైసలు రాలేదు. పనులు చేసేముందు ఓ మాట.. చేసినంక మరో మాట మాట్లాడుతున్నరు.. పనులు చేస్తే పైసలు వస్తయన్న గ్యారంటీ లేదు. అట్లాంటప్పుడు పనులు ఎందుకు చేయాలంటూ మండల సభలో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్​ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్​ఆఫీసులో మంగళవారం ఎంపీపీ తడక రాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పెండ్యాల రవీందర్​రెడ్డి మాట్లాడుతూ..  పనులు పూర్తి చేసినా ఎంబీలు చేయకుండా తిప్పుకుంటున్నారని, ఎంబీలు చేసిన వాటికీ బిల్లు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్​ భగీరథ నీళ్లు ఊళ్లోకి వస్తలేవని, ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించినా ఒక్క నల్లా పోయడం లేదని, తరచూ లీకేజీలు అవుతున్నాయని, ఆఫీసర్లు కాంట్రాక్టర్​ను వెనకేసుకువస్తున్నారని మండిపడ్డారు. మాదన్నపేట గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్​ సంతకాలు లేకుండానే 15వ ఫైనాన్స్​నిధులు ఎట్లా డ్రా చేస్తున్నారని ఆఫీసర్లను సర్పంచ్​ చెన్నయ్య నిలదీశారు. దళితబంధు డబ్బుల కోసం లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఇంకా మంజూరు చేయడం లేదన్నారు.  సభలో అన్ని అంశాలు చర్చకు రాకముందే ఎంపీపీ తడక రాణి సభ ముగిసిందని ప్రకటించడంతో పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. 

పెండింగ్​ బిల్లులు విడుదల చేయాలె

నర్సాపూర్(జి): చేసిన పనులకు సర్కారు బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సర్పంచులు మండల సమావేశాన్ని బైకాట్​చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఎంపీపీ కొండ్ర రేఖ రమేశ్​ఆధ్వర్యంలో రైతు వేదికలో నిర్వహించారు. ఎనిమిది గ్రామాల సర్పంచులు  ఈ సమావేశాన్ని బైకాట్​చేశారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, క్రీడా మైదానాలు ఇలా గ్రామానికి సంబంధించిన  ఎన్నో అభివృద్ధి పనులు అప్పులు తెచ్చి మరీ చేశామని, మరోవైపు ట్రాక్టర్ ఈఎంఐలు కట్టాల్సి వస్తోందన్నారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటూ వాపోయారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సర్పంచులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో రూ. 30 లక్షల వరకు ఈజీఎస్ పనులు అప్పు చేసి చేశామని సర్పంచ్​చెన్న మహేశ్​చెప్పారు. బిల్లులు రాక మిత్తీలు పెరిగిపోతున్నాయన్నారు. వెంటనే సర్కారు బిల్లులు చెల్లించాలని కోరారు.