పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్

పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్

కమలాపూర్/ఎల్కతుర్తి, వెలుగు:పదేండ్ల పాలనలో హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భార్య మెడలో పుస్తెల తాడు అమ్ముకున్నానని చెప్పే బండి సంజయ్​కు వందల కోట్లు ఎట్ల వచ్చాయని ప్రశ్నించారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి పొన్నం మాట్లాడారు. ‘‘అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తున్నది. నిరుద్యోగులు, రైతులను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది.

 కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ కల్పిస్తే కేసీఆర్ అవహేళన చేస్తున్నడు. మేము అధికారంలో ఉన్నన్ని రోజులు ఆర్టీసీ సేవలు కొనసాగుతాయి. త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చి తర్వాత ఎత్తేసింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కమలాపూర్ లో గ్యాస్ ప్లాంట్, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, జమ్మికుంటకు బ్రిడ్జి, తిరుపతికి రైలు తీసుకొచ్చా’’అని అన్నారు. తమ ప్రభుత్వాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బండి సంజయ్, వినోద్ కుమార్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. అక్షింతలు అంటు దేవుడు ఫొటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.

వినోద్ కుమార్ నాన్ లోకల్: వెలిచాల

గతంలో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్ కుమార్ నాన్ లోకల్ అని, ఆయనకు కరీంనగర్ పై ప్రేమ లేదని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను రాష్ట్ర ప్రజలు బండకేసి కొట్టారన్నారు. బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. కరీంనగర్​కు నిధులు తీసుకురాలేదని విమర్శించారు. ఆయన పదో క్లాస్ ఫెయిల్ అని, రాముడి ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని మండిపడ్డారు. బండి సంజయ్​కు ఓటేసి ఆగం కావొద్దన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తదని, అంబేద్కర్ విగ్రహాలు తీసేస్తదని అన్నారు. కార్నర్ మీటింగ్​లో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్​చార్జ్ వొడితల ప్రణవ్, నేతలు కర్ణకంటి మంజులా రెడ్డి, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.