
బంగ్లా అమ్మైనా ఇండ్లు కట్టిస్తాన్నడు
నాలుగు రోజులుగా వరదల్లో మునిగినం
ఇప్పుడు గుర్తుకొచ్చినమా?
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ను నిలదీసిన హిందూపూర్గ్రామస్తులు
పోలీసుల సాయంతో మంత్రిని ఊరుదాటించిన ఎస్పీ
మహబూబ్నగర్, మక్తల్/మక్తల్టౌన్, వెలుగు:
‘‘ కేసీఆర్ సార్ బంజారాహిల్స్‌లోని తన బంగ్లా అమ్మి అయినా మాకు ఇండ్లు కట్టిస్తనన్నడు. పదేండ్ల కిందట కూడా ఇక్కడ వరదలొచ్చినయి. అప్పట్ల పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్మాకు మాట ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలే. తెలంగాణ సీఎంగా ఉండి కూడా ఐదేండ్లు గడిచిపాయె. ఇప్పటికైనా మాకు ఇచ్చిన మాట మీ కేసీఆర్‌కు యాదికుందా? లేదా..?” రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్నగర్ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, మఖ్తల్ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిలను నిలదీస్తూ ప్రజలు అడిగిన ప్రశ్నలివి. సోమవారం నారాయణ పేట జిల్లా మాగనూర్మండలం హిందూపూర్‌లో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే వచ్చారు. దీంతో నాలుగు రోజుల నుంచి వరదల్లో మునిగి అవస్థలు పడుతుంటే పట్టించుకోకుండా, ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్తులు నిలదీయడంతో ముగ్గురు నేతలూ కంగుతిన్నారు. మూడు రోజుల నుంచి తాగునీరు కూడా లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నామని, తమను అడిగే వారే కరువయ్యారని గ్రామస్తులు వారిపై ఫైర్అయ్యారు. సీఎం కేసీఆర్హామీని ప్రస్తావిస్తూ మంత్రిని కదలనీయకుండా అడ్డుకున్నారు. ‘‘మీ కేసీఆర్ ఎంపీగా ఉండి మాకు వాగ్దానం చేశారు. ఇంతవరకు అతిగతీ లేదు” అని నిలదీయడంతో మంత్రితో పాటు ఎంపి, ఎమ్మెల్యే అవాక్కయ్యారు. చివరకు రోడ్డుపై బైటాయించేందుకు సిద్ధం కావడంతో జిల్లా ఎస్పీ చేతన పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. గ్రామస్తులకు నచ్చచెప్పి, మంత్రిని పంపించేందుకు ప్రయత్నించారు. వారికి సర్దిచెప్పారు. మంత్రి శ్రీనివాస్గౌడ్కారు ఎక్కకుండా ప్రజలు పదేపదే అడ్డుకోవడంతో ఆయన కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆయన కారులో ఎక్కి, అక్కడి నుంచి వాసునగర్కు బయలుదేరారు.
కేసీఆర్ హామీకి పదేళ్లు
పదేండ్ల క్రితం 2009లో కృష్ణానదికి భారీ వరదలు రావడంతో అప్పటి మహబూబ్‍నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటి విలయానికి పాలమూరు జిల్లా తల్లడిల్లిపోయింది. ఢిల్లిలో కంటి ఆపరేషన్ చేసుకున్న కేసీఆర్ పార్టీ నేతలు కోరడంతో నేరుగా శంషాబాద్‍లో హెలికాప్టర్ ఎక్కి మాగనూరు మండలం హిందుపూర్ చేరుకున్నారు. హెలికాప్టర్ దిగే సమయంలో కేసీఆర్ మెట్లు ఉంటాయని భావించి, కాలు కింద పెట్టడంతో తూలిపడ్డారు. పక్కనే ఉన్న పైలెట్, ఇతర సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. ఆయన వెంట జలవనరుల నిపుణుడు దివంగత విద్యాసాగర్, కర్నె ప్రభాకర్ కూడా ఉన్నారు.
అనంతరం పాఠశాల ఆవరణలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఇంగేం చూస్తాం..హెలికాప్టర్‍లో వస్తుంటే అంతా కనిపించింది. ఊరుఊరంతా నీళ్లల్లో మునిగింది. ఈ హిందూపూర్ వారికి మాటిస్తున్న ప్రభుత్వానికి ఉత్తరం రాస్తా. స్పందించకుంటే.. బంజారాహిల్స్ లో నా బంగ్లా అమ్మైనా సరే మీకందరికి పక్కా ఇళ్లు కట్టిస్తా. ఊరికి దూరంగా మంచి ఇళ్లు కట్టిస్త. ఇక ఎంతపెద్ద వరదైనా రానీ” అని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత రోజుల్లో కేసీఆర్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికే దాదాపు ఆరేళ్లు కావస్తోంది. ఐనప్పటికీ ిహిందూపూర్ వాసుల వరద కష్టాలు తీరలేదు. తాజాగా సాగర్ నీళ్లు రావడంతో.. ఆ ఊరు ఊరంతా మునిగిపోయింది.
