తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటి ఆమని తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆమె, ఇప్పుడు ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శనివారం నాడు ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ లో చేరారు.
ఘనంగా పార్టీలోకి ఆహ్వానం
హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమనీతో పాటు ప్రముఖ సినీ మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా బీజేపీలో చేరారు. పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికాయి.
మోదీ విధానాలే నన్ను నడిపించాయి..
పార్టీలో చేరిన అనంతరం ఆమని మీడియాతో మాట్లాడుతూ .. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. నేడు ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబడే స్థాయికి చేరిందన్నారు. ఒక భారతీయురాలిగా నన్ను గర్వపడేలా చేసిన ఆయన ఆశయాలకు ఆకర్షితురాలినై బీజేపీలో చేరుతున్న ట్లు తెలిపారు. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి అని ఆమె చెప్పారు. తనకు పదవులపై ఆశ లేదని, కేవలం ఒక సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
వెండితెర 'మిస్టర్ పెళ్లాం' ప్రస్థానం
1992లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ చిత్రంతో ఓ సంచలనంలా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు ఆమని. తొలి చిత్రంతోనే తన నటనతో అందరినీ కట్టుపడేశారు. ఆ తర్వాత శుభలగ్నం, మావిచిగురు, శుభ సంకల్పం వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువయ్యారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో గృహిణి పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.. ఈ సినిమాకు గాను ఆమె ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకున్నారు. జగపతి బాబు వంటి స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లలో కూడా నటిస్తోంది.
రాజకీయాల్లో సినీ గ్లామర్
ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆమని వంటి సీనియర్ నటి బీజేపీలో చేరడం వల్ల పార్టీకి గ్లామర్ తో పాటు, మహిళా ఓటర్లలో మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమె రాకతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. వెండితెరపై సంప్రదాయబద్ధమైన పాత్రలతో మెప్పించిన ఆమని, రాజకీయ క్షేత్రంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
చలనచిత్ర నటి శ్రీమతి ఆమని గారు భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వక ఆహ్వానం పలికాను.
— N Ramchander Rao (@N_RamchanderRao) December 20, 2025
గౌరవప్రదమైన నటనతో, సామాజిక స్పృహతో ప్రజల మనసు గెలుచుకున్న ఆమని గారు.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికత, నాయకత్వం పట్ల ఆకర్షితులై, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని… pic.twitter.com/DUWOXWPihG
