డీలిమిటేషన్ కు లైన్ క్లియర్.. నేడో, రేపో ఫైనల్ నోటిఫికేషన్

డీలిమిటేషన్ కు   లైన్ క్లియర్..  నేడో, రేపో ఫైనల్ నోటిఫికేషన్
  • తొలగిన అన్ని రకాల అడ్డంకులు
  • పిటిషనర్లకు మాత్రమే మ్యాప్​లు, 
  • జనాభా లెక్కలు ఇవ్వాలన్న హైకోర్టు  
  • వార్డులకు మళ్లీ పాత పేర్లే  
  • ఈ నెల 31లోపు కేంద్రానికి నివేదిక

హైదరాబాద్ సిటీ, వెలుగు:  జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్​కు లైన్ క్లియర్ అయింది. నేడో, రేపో ఫైనల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఈ నెల 9న డీలిమిటేషన్ పై ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసి10వ తేదీ నుంచి అభ్యంతరాలను, సలహాలను స్వీకరించారు. ఈ గడువు కూడా గురువారంతో పూర్తయ్యింది. వాస్తవానికి మంగళవారంతోనే గడువు ముగిసినా నలుగురు వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించటంతో మరో రెండు రోజులు గడువు పెంచింది. దీంతో గురువారం సాయంత్రం వరకు అన్ని చోట్లా కలిపి 5,905 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ కూడా హైకోర్టులో సవాలు చేయగా ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదని, పిటిషన్లు దాఖలు చేసిన నలుగురికి డీలిమిటేషన్ మ్యాప్ లు, వార్డుల జనాభా లెక్కలను ఇస్తే సరిపోతుందని ఆదేశించింది. దీంతో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్​కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే అన్ని వివరాలు రెడీగా ఉండడంతో ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నట్టు తెలిసింది.  

తర్వాత ఎన్నికల ప్రక్రియే..

డీలిమిటేషన్ పూర్తవ్వడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రధాన అడ్డంకి తొలగింది. అధికారులు 2011 జనాభా లెక్కలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వద్ద ఉన్న జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని 45 వేలకు ఓ వార్డు అనే ప్యారమీటర్ తో.. పదిశాతం తక్కువ, ఎక్కువగా వార్డులను డీలిమిటేషన్ చేశారు. ఈ లెక్కలను ఈ నెల 31వ లోపు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.  నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందిస్తారు. తర్వాత ఆయా సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించి డ్రాఫ్ట్ రూపకల్పన చేసి, రిజర్వేషన్లపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వాటిని డిస్పోజ్ చేసి ఫైనలైజ్​చేయనున్నట్లు తెలిసింది. తర్వాత సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డులకు ఎన్నికలను నిర్వహించే అవకాశాలున్నాయి. దీనికంతటికీ సుమారు ఏడాది వరకు పట్టవచ్చని అంటున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 2027లో జనాభా లెక్కలు నిర్వహించనున్నందున ఆ లెక్కల ఆధారంగానే ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

 పాత పేర్లే కొనసాగింపు

పునర్విభజన ప్రక్రియలో మార్పులు చేసిన వార్డుల పేర్లపై చాలా వరకు అభ్యంతరాలు వచ్చాయి. కౌన్సిల్ లోనూ ఇదే విషయాన్ని సభ్యులు ప్రస్తావించారు. ఏండ్లుగా ఉన్న పేర్లు ప్రజలు సెంటిమెంట్​గా భావిస్తారని, ఆ పేర్లు మార్చవద్దని కోరారు. దీంతో తిరిగి పాత పేర్లనే కొనసాగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.