సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్. ఇకపై ప్రతి మంగళ , శనివారాల్లో హైదరాబాద్ లోని కాలనీల్లో సైబర్ క్రైమ్స్ పై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సజ్జనార్. శనివారం ( డిసెంబర్ 20 ) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జనార్. అవగాహన తోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చుని అన్నారు.
హైదరాబాద్ లో రోజుకు కోటి రూపాయల సైబర్ మోసాలు జరుగుతున్నాయని.. సైబర్ నేరాలు పెద్ద సవాల్ గా మారాయని అన్నారు సజ్జనార్. సైబర్ నేరగాళ్లు భయాన్ని, ఆశ ను టార్గెట్ గా చేసుకుంటారని.. ఇటీవల డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఎక్కువయ్యాయని అన్నారు సజ్జనార్. ఎలాంటి అనుమానిత కాల్స్ వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. లేదా 1930 కి కాల్ చేయాలని సూచించారు సజ్జనార్.
ఏపీకే ఫైల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరగాళ్లు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను టార్గెట్ చేస్తుంటారని.. గిఫ్ట్ లు, కూపన్లు, వోచర్లు, ఫెస్టివల్ ఆఫర్లు అంటూ ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
