Narendra Modi Biopic: ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’ ప్రారంభం.. ప్రధాన పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ !

Narendra Modi Biopic: ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’ ప్రారంభం.. ప్రధాన పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ !

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత ప్రయాణం వెండితెరపై మరోసారి ఆవిష్కృతం కాబోతోంది. లేటెస్ట్ గా 'మా వందే' ( Maa Vande ) టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ బయోపిక్ సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.  రాజకీయ పోరాటాలు, దేశాభివృద్ధి కంటే మించి, ఒక కుమారుడిగా మోదీకి తన తల్లి హీరాబెన్ మోదీతో ఉన్న అనుబంధమే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఒక తల్లి సంకల్పం - ఒక కుమారుడి విప్లవం

సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు క్రాంతి కుమార్ సి.హెచ్. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోదీ బాల్యం నుండి దేశ నాయకుడిగా ఎదిగిన తీరు వరకు చూపిస్తూనే, ఆయన వ్యక్తిత్వాన్ని మలిచిన తల్లి హీరాబెన్ ప్రభావంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఒక తల్లి ఆత్మస్థైర్యం దేశ గమనాన్ని ఎలా మార్చింది అనేది ఈ సినిమాలోని మూల సందేశం. ఇందులో తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ నటిస్తుండటం విశేషం.

మోదీ పాత్రలో ఉన్ని ముకుందన్

మలయాళంలో 'మాలిక్‌పురం' వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాని మోదీ పాత్రను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా ఎన్నో బలమైన పాత్రలు పోషించే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు. కానీ, ‘మా వందే’ ద్వారా కేవలం అధికారం, శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా.. ఒక మనిషిలోని భావోద్వేగాలను, మానసిక శక్తిని నిజాయితీగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను అని తెలిపారు. అహ్మదాబాద్‌లో పెరిగిన ఉన్ని ముకుందన్‌కు మోదీ అంటే అపారమైన గౌరవం. గతంలో ఆయన మోదీని కలిసినప్పుడు పొందిన స్ఫూర్తే ఈ పాత్ర చేయడానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

బాహుబలి, కేజీఎఫ్ టెక్నీషియన్స్ బృందం

ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం భారతదేశపు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాహుబలి, RRR ఫేమ్ కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ గా సాబు సిరిల్ పనిచేస్తున్నారు. ఇక KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.  'మా వందే' కేవలం హిందీలో మాత్రమే కాకుండా.. తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మోదీపై గతంలో సినిమాలు వచ్చినప్పటికీ, తల్లితో ఉన్న భావోద్వేగ బంధం నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.