చదివింది ఎంబీబీఎస్.. కంటి వైద్యులుగా ప్రచారం చేసుకుంటూ దోపిడీ.. మిర్యాలగూడలో నకిలీ డాక్టర్లకు చెక్ పెట్టిన TSMC !

చదివింది ఎంబీబీఎస్.. కంటి వైద్యులుగా ప్రచారం చేసుకుంటూ దోపిడీ.. మిర్యాలగూడలో నకిలీ డాక్టర్లకు చెక్ పెట్టిన TSMC !

కేవలం MBBS  పూర్తి చేసి కంటి వైద్యులమని చెప్పి అమాయకుల నుంచి లక్షల్లో దోచుకుంటున్న నకిలీ వైద్యులపై కొరడా ఝుళిపించింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం. ప్రైవేట్ కంటి ఆసుపత్రుల అక్రమాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. 

మిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యుల బాగోతం బట్టబయలు చేశారు మెడికల్ కౌన్సిల్ అధికారులు. ఎంబీబీఎస్ మాత్రమే చదివి కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేసుకుంటున్న శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి కి చెందిన డా. ఎం. భరత్ భూషన్, షాలిని కంటి ఆసుపత్రికి చెందిన  డా. కె. వెంకటేశ్వర్లు లపై రైడ్స్ నిర్వహించారు. విషయం తెలిసి మరో నకిలీ వైద్యుడు, రూరల్ మెడికల్ ప్రాక్టిషనర్ (RMP) మునీర్ – ఫ్రెండ్స్ క్లినిక్ పరారయ్యాడు.

కంటి వైద్యులు లేకుండానే ఆపరేషన్లు నిర్వహిస్తున్న ఆప్టోమెట్రీ / ఆఫ్తాల్మాలజీ టెక్నీషియన్లపై కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉండే టెక్నీషియన్ల ద్వారా ఆసుపత్రులు నిర్వహిస్తున్న డా. శ్రీకుమార్, డా. ప్రభు చైతన్య, డా. అమర్, డా. బషీర్, డా. రామ శేషయ్యలకు నోటీసులు అందజేశారు.

అర్హత లేని వైద్యులు.. అర్హతకు మించి మందులు, పరీక్షలు:

ఈ తనిఖీల్లో మొత్తం 8 కేంద్రాలను పరిశీలించగా, ఏ ఒక్క కంటి ఆసుపత్రిలో కూడా అర్హత గల కంటి వైద్య నిపుణులు లేకపోవడం గుర్తించి అధికారులు విస్తుపోయారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుండి కంటి వైద్య నిపుణుల పేర్లతో అనుమతులు పొందినట్లు గుర్తించారు. కానీ అప్తాల్మాలజీ, ఆప్టోమెట్రీ టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నిర్వహిస్తూ, వైద్యులు లేకుండానే అర్హతకు మించి మందులు, పరీక్షలు సూచించడం, కొన్నిచోట్ల ఆపరేషన్లు కూడా నిర్వహించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్లు తేలింది. అనుమతులు పొందిన కంటి వైద్యులు మాత్రం హైదరాబాద్ , ఇతర నగరాల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత ఘోరం:

ఎంబీబీఎస్ మాత్రమే చదివిన ఎం. భరత్ భూషన్, డా. కె. వెంకటేశ్వర్లు తాము ఎంఎస్ (ఆఫ్తాల్మాలజీ) చేసినట్లు తప్పుడు వివరాలు ప్రదర్శించి, కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేసుకుంటూ, వారి స్థానంలో కేవలం టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు మెడికల్ కౌన్సిల్ సభ్యులు. అలాగే కోమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకుడు, నకిలీ వైద్యుడు ఎ. కోటేశ్వర్ రావు కూడా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు. ఎటువంటి అర్హతలు లేకుండానే తన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో బెడ్లు ఏర్పాటు చేసి, ఇష్టానుసారంగా యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు తేలింది. మరో నకిలీ వైద్యుడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు మునీర్ తనిఖీ విషయం తెలిసి పరారైనట్లు గుర్తించారు.

తనిఖీ నిర్వహించిన కేంద్రాలు :
    1.    శ్రీ వెంకటేశ్వర (SV) కంటి హాస్పిటల్
    2.    శ్రీ మహాలక్ష్మి కంటి హాస్పిటల్
    3.    అన్నపూర్ణ నేత్రాలయం
    4.    యశస్వి కంటి హాస్పిటల్
    5.    షాలిని ఐ క్లినిక్
    6.    రఫా విజన్ కేర్ సెంటర్
    7.    శివ సాయి కంటి హాస్పిటల్

అర్హతకు మించి వైద్యం నిర్వహిస్తున్న టెక్నీషియన్లు నాగేష్, వాల్కె శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వర్ రావు, వెంకటేష్, వికాస్ కుమార్, నకిలీ వైద్యుడు / RMP ఎ. కోటేశ్వర్ రావులపై NMC, TMPR చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు సభ్యులు తెలిపారు. అలాగే కంటి వైద్య నిపుణులు డా. శ్రీకుమార్, డా. ప్రభు చైతన్య, డా. బషీర్, డా. అమర్లకు కౌన్సిల్ నుండి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

నకిలీ కంటి వైద్య నిపుణులు డా. ఎం. భరత్ భూషన్, డా. కె. వెంకటేశ్వర్లులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్‌ప్రాక్టీసెస్ కమిటీ ముందు విచారణ నిర్వహించి, సంతృప్తికరమైన సమాధానం రాకపోతే అవసరమైతే వారి ఎంబీబీఎస్ డిగ్రీ లైసెన్సులను సస్పెండ్ చేస్తామని తెలిపారు.  కంటి ఆసుపత్రుల అవక తవకలపై  తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి సిఫార్సు చేస్తామని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్  డా వి. నరేష్ కుమార్ చెప్పారు. 

ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా నకిలీ వైద్యులపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, అర్హతకు మించి వైద్యం చేయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం, లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సభ్యులు డా. కె. రవి కుమార్,  డా జె. శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా. కె. మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు మిషన్ మిర్యాలగూడ ఎగైనెస్ట్ క్వాకరీ లో భాగంగా సభ్యులు డా. వి. నరేష్ కుమార్, డా. కె. రవి కుమార్, డా. జె. శ్రీకాంత్ వర్మ,విజిలెన్స్ అధికారి ఎం. రాకేష్‌ల బృందం మిర్యాలగూడ పట్టణంలోని పలు కంటి ఆసుపత్రులు, నకిలీ వైద్యులు / RMPలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.