ఫామ్ కాదు క్లాస్ శాశ్వతం: టీ20 వరల్డ్ కప్‎కు గిల్‎ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ ఆశ్చర్యం

ఫామ్ కాదు క్లాస్ శాశ్వతం: టీ20 వరల్డ్ కప్‎కు గిల్‎ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ ఆశ్చర్యం

న్యూఢిల్లీ: 2026 టీ20 ప్రపంచ కప్ భారత జట్టు నుంచి టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను తొలగించడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్‎ను పక్కకు పెడుతూ బీసీసీఐ తీసుకున్న సాహసోపేత నిర్ణయం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. టీ20 ఫార్మాట్లో గిల్ ఇటీవల ఫామ్‎లో లేకపోయినా అతడి క్లాస్ శాశ్వతమని పేర్కొన్నారు. చాలా కాలం పాటు గిల్ టీ20 క్రికెట్ దూరంగా ఉండటం వల్లే అతడు లయ కోల్పోయాడని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‎లో గిల్ ఫామ్ లేమితో ఇబ్బందిపడ్డప్పటికీ అతడొక ఒక క్లాసిక్ ప్లేయరని కొనియాడారు. టెస్ట్, వన్డే ఫార్మాట్‎పై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్లే టీ20ల్లో గిల్ దూకుడుగా ఆడలేకపోయాడని.. ఫామ్ తాత్కాలికం క్లాస్ శాశ్వతమని గవాస్కర్ పేర్కొన్నారు. ఐపీఎల్‌లో గిల్ ఆటను చూశామని.. టీ20 ఫార్మాట్ అతనికేమి కొత్త కాదన్నారు. ప్రస్తుతం ఫామ్‎లో లేకపోవడం.. చాలా కాలంగా టీ20 ఫార్మాట్‎కు దూరంగా ఉండటం వల్ల అతడు కాస్తా ఇబ్బండి పడుతున్నాడని చెప్పారు. 

2026 టీ20 వరల్డ్ కప్‎కు భారత జట్టును శనివారం (డిసెంబర్ 20) బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన స్వ్కాడ్‎ను ప్రకటించగా.. ఈ జట్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్‎ చోటు దక్కలేదు. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న గిల్‎పై సెలక్టర్లు  వేటు వేశారు. ఆసియా కప్ 2025 నుంచి టీ20ల్లో గిల్‎ను బలవంతంగా ఓపెనర్‎గా కొనసాగించారు. 

ALSO READ : ముగ్గురు మొనగాళ్లకు మొండి చెయ్యి: టీ20 వరల్డ్ కప్‌లో స్థానం కోల్పోయిన మ్యాచ్ విన్నర్లు వీరే

ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇటీవలే సౌతాఫ్రికా సిరీస్‎లలో కూడా విఫలమైనప్పటికీ గిల్‎కు వరుస ఛాన్స్‎లు ఇచ్చారు. శాంసన్ లాంటి ఆటగాడిని తప్పించి గిల్‎ను జట్టులో కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ కీలకమైన వరల్డ్ కప్ స్వ్కాడ్ నుంచి గిల్‎ను తప్పించి ఎట్టకేలకు సంజు శాంసన్‎ను ఎంపిక చేసింది. 

వరల్డ్ కప్‎కు టీమిండియా స్క్వాడ్:  

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా