బంగ్లాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. యూనస్ ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్.. లేదంటే భారీ ఉద్యమమే..!

బంగ్లాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. యూనస్ ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్.. లేదంటే భారీ ఉద్యమమే..!

ఢాకా: బ్లంగాదేశ్‎లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియల అనంతరం శనివారం (డిసెంబర్ 20) రాజధాని ఢాకాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉస్మాన్ హదీ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. హదీ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. హదీ హత్యకు కారణమైన వారందరినీ 24 గంటల్లోపు అరెస్టు చేయాలని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 

లేదంటే దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మరికొందరు బంగ్లాదేశ్ లో షరియా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నారా-ఎ-తక్బీర్ అంటూ స్లోగన్స్ హోరెత్తించారు. హదీ మద్దతుదారుల ప్రొటెస్ట్‎తో ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా భారీగా బలగాలను మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో కర్ప్యూ విధించింది. 

గతేడాది జులైలో షేక్ హసీనా సర్కారును గద్దె దింపడం వెనక కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ లీడర్, ‘ఇంక్విలాబ్ మంచ్’ కన్వీనర్ షరీఫ్​ఉస్మాన్ హాదీ(32) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఢాకాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తున్న హాదీపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడు సింగపూర్‎లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

 హాదీ మరణంతో గురువారం రాత్రి రాజధాని ఢాకాలో అతడి మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇండియన్ ఆఫీసులపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల అల్లరిమూకలు విధ్వంసానికి దిగారు. శనివారం (డిసెంబర్ 20) ఢాకాలో హాదీ అంత్యక్రియలు నిర్వహించారు. హాదిని జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కన ఖననం చేశారు. 

హాదీ అంతిమయాత్రలో అతడి మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంత్యక్రియల తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురైన అతడి అనుచరులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. హాదీని చంపిన హంతకులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని లేదంటే దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని యూనస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. హాదీ అనుచరుల నిరసనలతో బంగ్లా మళ్లీ భగ్గుమంది.