రంగారెడ్డిలో 100 రోజుల హెల్త్ మిషన్ : డీఎంహెచ్‌‌‌‌వో

రంగారెడ్డిలో 100 రోజుల హెల్త్ మిషన్  : డీఎంహెచ్‌‌‌‌వో
  • మార్చి 4 నుంచి మొదటి దశ ప్రారంభిస్తాం : డీఎంహెచ్‌‌‌‌వో

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో మూడు దశల్లో వంద రోజుల ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు డీఎంహెచ్‌‌‌‌వో డాక్టర్ కే. లలితాదేవి వెల్లడించారు. శుక్రవారం వైద్యాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్చి 4 నుంచి 31 వరకు జరిగే మొదటి దశలో మాతృ, శిశు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా గైనకాలజిస్ట్​లతో అనీమియా స్క్రీనింగ్, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ పరీక్షలతో పాటు చిన్న పిల్లలకు పూర్తిస్థాయి టీకాలు, విటమిన్​- -ఏ పంపిణీ చేపడతామన్నారు. అలాగే యువతలో పరీక్షల ఒత్తిడి నివారణకు కౌన్సిలింగ్, వృద్ధులకు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రత్యేక జేరియాట్రిక్ క్యాంపులు నిర్వహిస్తామని వివరించారు.

అంగన్వాడీలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ గ్రామ, పట్టణ స్థాయిల్లో విస్తృత అవగాహన కల్పించడమే కాకుండా, ఆర్బీఎస్‌‌‌‌కే వైద్యుల ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలల్లో కంటి పరీక్షలు, రక్తహీనత తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.