సెక్రటేరియెట్‌ లో 100 శాతం ఈ-ఆఫీస్...అన్ని శాఖల్లో ఫైల్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే

సెక్రటేరియెట్‌ లో 100 శాతం ఈ-ఆఫీస్...అన్ని శాఖల్లో ఫైల్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే
  •     పెండింగ్‌కు చెక్.. ఒకట్రెండు రోజుల్లోనే ఫైల్ క్లియర్  
  •     త్వరలో జిల్లాలకు విస్తరణ.. నేరుగా సచివాలయంతో లింక్ 

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్ర సచివాలయంలో పరిపాలనా సంస్కరణలు కొత్త పుంతలు తొక్కాయి. సెక్రటేరియెట్​లో ‘ఈ-ఆఫీస్’ విధానం ఇప్పుడు నూటికి నూరు శాతం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఇకపై ఏ ఒక్క శాఖలోనూ కాగితాల  కదలిక ఉండకూడదన్న ఆదేశాలు అమలవుతున్నాయి. సీఎస్ మొదలుకొని కింది స్థాయి ఏఎస్ఓ వరకూ అందరూ డిజిటల్ బాట పట్టారు. దీన్ని ఒక చాలెంజ్‌గా తీసుకున్న సీఎస్ రామకృష్ణారావు రికార్డు సమయంలోనే సెక్రటేరియెట్ మొత్తాన్ని పేపర్ రహితంగా మార్చేశారు. 

ఇప్పుడు ఏ ఫైల్ ఎప్పుడు  మొదలైంది, ఎక్కడికి వెళ్లింది.. ఎక్కడ పెండింగ్​లో ఉన్నదనేది ఆన్​లైన్​లో వెంటనే తెలిసిపోతోంది. ఆయా శాఖలో ఏ ఫైల్​ను పుటప్ చేసినా, బయటి నుంచి వచ్చే ప్రతి వినతి పత్రాన్ని లేదా లేఖలను ఇన్​వార్డ్ సెక్షన్‌లో స్కాన్ చేసి, దానికి ఒక ఎలక్ట్రానిక్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్ నుంచి పైస్థాయి కార్యదర్శి వరకు ఫైల్ మొత్తం ఈ ఆఫీస్​లోనే మూవ్ అవుతుంది.  అధికారులు తమ అభిప్రాయాలను, ఆమోదాలను ‘డిజిటల్ సంతకం’  ద్వారా చేస్తారు.  ఈ విధానాలతో కలిగే ప్రధాన ప్రయోజనం పారదర్శకత, వేగం.  

ఒక ఫైల్ ప్రస్తుతం ఏ అధికారి వద్ద ఉందో, ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉందో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ డాష్‌బోర్డులో చూసుకునే వెసులుబాటు ఉంటుంది. అనవసరంగా ఫైళ్లను తమ వద్ద అట్టిపెట్టుకునే వీలు అధికారులకు ఉండదు. ఒకటి, రెండు రోజుల కంటే మించి ఏదైనా ఫైల్ పెండింగ్‌లో ఉంటే, దానికి గల కారణాలను సిస్టమ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే లక్షల కొద్దీ పేపర్లను భద్రపరచాల్సిన అవసరం లేకుండా సర్వర్లలో డేటా సురక్షితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

జిల్లా ఆఫీసులకు సెక్రటేరియెట్ తో లింక్.. 

కేవలం సచివాలయంతో సరిపెట్టకుండా, ఈ డిజిటల్ విప్లవాన్ని క్షేత్రస్థాయికి విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టరేట్లు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో ఈ-–ఆఫీస్ అమలు కానుంది. ముఖ్యంగా జిల్లా, మండల స్థాయి కార్యాలయాలను నేరుగా రాష్ట్ర సచివాలయంతో అనుసంధానించే  ప్రక్రియకు రూపకల్పన చేస్తున్నారు. దీంతో మారుమూల ప్రాంతం నుంచి వచ్చే ప్రతిపాదనలు పోస్టులో కాకుండా, నేరుగా ఈ-–ఆఫీస్ ద్వారా సెక్రటేరియెట్‌కు క్షణాల్లో చేరతాయి. ఈ సమగ్ర విధానం వల్ల పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని భావిస్తున్నారు.