కూతురి వేధింపులు భరించలేకపోతున్నాను.. చావడానికైనా అనుమతివ్వండంటూ జగిత్యాల ప్రజావాణిలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు అధికారుల ముందు కన్నీరుమున్నీరవడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. వృద్ధాప్యంలో న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన ఆ తల్లి.. చివరికి చావే శరణ్యమంటూ అధికారులను వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఎండ్రికాయల గంగవ్వ భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మరణించారు. దీంతో తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం ద్వారా గంగవ్వ తన మూడో కుమార్తెకు ఆ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేసింది. ఉద్యోగం వచ్చిన సమయంలో.. కుటుంబ ఆస్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ కుమార్తె పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రం కూడా రాసిచ్చింది.
కానీ ఉద్యోగం వచ్చిన నాటి నుంచి గత 27 ఏళ్లుగా ఆ కూతురు తల్లి ఇంట్లోనే ఉంటూ ఆమెను మానసికంగా వేధిస్తూ వచ్చింది. అంతటితో ఆగకుండా, తల్లి వద్ద ఉన్న 9 లక్షల రూపాయల నగదు, మూడు తులాల బంగారం లాక్కుని, గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కూతురి వేధింపులు భరించలేక, ప్రాణ భయంతో ఆ వృద్ధురాలు ప్రస్తుతం తన పెద్ద కుమార్తె ఇంట్లో ఆశ్రయం పొందుతోంది.
ఇటీవల ఆ మూడో కూతురు మళ్లీ తిరిగి వచ్చి, తల్లి ఇంటి తాళాలు పగులగొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించింది. వృద్ధురాలైన కన్నతల్లిని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు సరే కదా.. వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ విషయంపై గంగవ్వ గతంలోనే కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. వృద్ధాప్యంలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తనకు.. ఈ నరకం అనుభవించేకంటే చనిపోవడమే మేలనిపించిందని, అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టుకుంది ఆ వృద్ధురాలు.
