గుడ్ న్యూస్: వంట గ్యాస్ ధర..రూ.100 తగ్గింపు

గుడ్ న్యూస్:  వంట గ్యాస్ ధర..రూ.100 తగ్గింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు.  గృహిణులపై ఆర్థికభారం దించేందుకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్​ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించారు.  ‘మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్​పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది.  ఇది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మహిళలపై ఆర్థికభారాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మన నారీశక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘వంటగ్యాస్​ను సామాన్యులకు అందుబాటు ధరలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. దేశంలోని కుటుంబాలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు. ఇది మహిళా సాధికారత పట్ల తమకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని మోదీ చెప్పారు. 

ఢిల్లీలో సిలిండర్​ ధర రూ.803

తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో నాన్​సబ్సిడీ గ్యాస్​ సిలిండర్​ ధర (14.2 కేజీలు) రూ. 803కు చేరుకోనున్నదని అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. స్థానిక ట్యాక్స్​లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆయిల్, గ్యాస్​ ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా తగ్గింపు సాధ్యమైందని తెలిపారు. అయినప్పటికీ పెట్రోల్​, డీజిల్​ ధరల్లో మార్పులేదని వెల్లడించారు. కాగా, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రూ.300 సబ్సిడీ పొందుతున్నవారికి సిలిండర్​ రూ. 503కే లభించనున్నది.  గత ఆరు నెలల్లో కేంద్రం గ్యాస్​ సిలిండర్​ ధరను  తగ్గించడం ఇది రెండోసారి. నిరుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఒక్కో సిలిండర్​పై కేంద్రం రూ.200 తగ్గించింది.